We Love Reading Summer Activities ( Class 1-5)@ 27.04.24

 *సోమరిపోతు మహావీరునికీ జై (నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ)* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

ఒకూర్లో ఒక పెద్ద సోమరిపోతు వుండేటోడు. వాడు చిన్నప్పట్నించీ చిన్న పని గూడా చేసేటోడు కాదు. ఎప్పుడు చూడు తినడం పన్నుకోవడం అంతే... పెండ్లయినా కొంచం గూడా మారలేదు. పెండ్లామే గొణుక్కుంటా అన్ని పనులు చేసుకొనేది.

ఒకసారి పెండ్లాం బైటకు పోతా “ఇదిగో... పొయ్యి మీదికి అన్నంగిన్నె ఎక్కిచ్చినాను. ఐదునిమిషాలాగి దించండి. నేను సంతకు పోయి సరుకులు తీసుకోనొస్తా" అని చెప్పి పోయింది. వీడు సరేలే అని తలూపినాడుగానీ అట్లాగే నిద్రపోయినాడు. పెండ్లాం సరుకులు తీసుకోనొచ్చి అలసిపోయి అన్నం తిందామని చూస్తే ఇంగేముంది ఒక్క మెతుకు గూడా లేదు. అంతా నల్లగా మాడిపోయి బొగ్గులెక్క అయిపోయింది. దాంతో ఆమె కోపంగా "ఇట్లాగయితే సంసారం సాగినట్లే. ఏం మొగోనివయ్యా నువ్వు పొద్దున లేసినప్పటి నుంచీ కాళ్ళూచేతులు లేనోని లెక్క ఊరికే కూచుంటావు గానీ ఒక్కపని గూడా చేయవు. చుట్టుపక్కల చూడుపో... అందరిండ్లలో మొగోళ్ళు ఎట్లా పని చేస్తా వున్నారో" అనింది.

దానికి వాడు "ఏందీ... నేనేం పని చెయ్యడం లేదా... పొద్దున్నుంచీ వంద ఈగలు చంపినాను తెలుసా... ఏమనుకుంటావున్నావో" అన్నాడు కోపంగా. 

"ఏందీ... ఎన్ని చంపినావు" అనింది పెండ్లాము. 

"వంద... వంద... చంపినానే వుత్త చేతుల్తో.... అదీ ఒక్కరోజులోనే" అన్నాడు మరింత గట్టిగా. 

సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి ముందు పక్కింటి పుల్లమ్మ పోతా వుంది. ఆమె ఆ మాటలు వినింది. “అబ్బా... ఏమో అనుకుంటిగానీ వీడు పెద్ద వీరుడే. ఒక్క రోజులోనే వంద మందిని వుత్త చేతుల్తో చంపడమంటే మాటలా" అనుకోని వెనకింటామెకు చెప్పింది. ఆమె ముందింటామెకు చెప్పింది. ఆమె పక్క వీధామెకు చెప్పింది. ఆమె వాళ్ళ బంధువులకు చెప్పింది. అట్లా ఒక్క రోజులోనే గడ్డివాములు గదా ఒకటంటుకుంటే గాలికి పక్కనున్నవన్నీ సరసరసర అంటుకున్నట్లు వూరువూరంతా తెలిసిపోయింది. 

ఆ మాటలు ఒక సైనికుడు విన్నాడు. “అబ్బా... ఒక్కరోజులోనే వందమందిని వుత్త చేతుల్తో చంపినాడంటే వీడెవడో సామాన్యుడు గాదు. రాజుగారికీ సంగతి చేరవేయాల్సిందే" అనుకోని వురుక్కుంటా పోయి విషయం చెప్పినాడు. 

రాజు ఆ మాటలు విని ఆశ్చర్యపోయినాడు.

"పొండి... పోయి... ఆ వీరున్ని తీసుకోని రాపోండి. అటువంటోడు మన ఊరిలో వుంటే మన రాజ్యానికెంతో మంచిది" అని సైనికులను పంపిచ్చినాడు.

ఆ సోమరిపోతు ఇంట్లో హాయిగా మంచమ్మీద కాలు మీద కాలేసుకోని కూర్చోని వేడివేడి పకోడీలు తింటా వున్నాడు. దూరంగా ఏవో గుర్రాలు వస్తా వున్న చప్పుడు వినబడింది. పక్కనే వున్న కిటికీ తెరచి చూసినాడు. దూరంగా గుర్రాలు, సైనికులు కనబన్నారు. 

“యాడికో పోతావున్నట్టున్నారు. మనకెందుకులే" అనుకున్నాడు. 

కాసేపటికి చప్పుడు మరింత దగ్గరగా వినిపించింది. కిటికీ తెరచి చూసినాడు. ఇంటి ముందు గుర్రాలు దిగుతా కనబన్నారు. పక్కింటికేమోలే అనుకోని మళ్ళా కిటికీ మూసేసినాడు. 

అంతలో తలుపు తట్టిన చప్పుడయింది. 

“ఏమే... ఎవరో వచ్చినట్టున్నారు. కొంచం పోయి చూడు" అన్నాడు మంచమ్మీద నుంచి లేయకుండానే. ఆమె పోయి తలుపు తెరిచింది. ఎదురుగా సైనికులు కనబన్నారు. 

వాళ్ళు లోపలికి వచ్చి ఆ సోమరిపోతుకి వంగి వంగి నమస్కారం చేసి "అయ్యా.... మిమ్మల్ని తీసుకోని రమ్మని రాజుగారు పంపిచ్చినారు. ఒక్కసారి వచ్చిపోండి" అన్నారు. 

"నేనా..... ఎందుకు... ఏం చేసినాను" అన్నాడు వాడు భయపడుతూ. 

"అయ్యా... మీరు ఒక్కరోజులోనే వుత్త చేతుల్తో వందమందిని చంపినారంట గదా... ఆ మాట ఆనోటా ఈనోటా పడి రాజుగారికి తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలుచుకోని రమ్మన్నాడు" అని చెప్పినారు. 

దానికి వాడు "నేనా నేనెవ్వరినీ చంపలేదే... మీరు ఎవరో అనుకోని ఇక్కడికి వచ్చినట్టున్నారు" అన్నాడు. 

ఆ మాటలకా సైనికులు "అయ్యా... మీకు గమ్మత్తులు ఆడడానికి మేమే దొరికినామా... మీరెంత దాచి పెట్టుకున్నా ఇప్పుడు మీ గురించి తెలియనోళ్ళు ఈ వూరిలో ఒక్కరు కూడా లేరు. తొందరగా రండి. రాజుగారు మీ కోసం ఎదురు చూస్తా వున్నారు" అన్నారు. 

ఆ మాటలినగానే సోమరిపోతు గుండె దడదడలాడింది. వెళితే ఏమవుతుందో తెలీదు. వెళ్ళకుంటే వదలరు. ఏదయితే అదయిందని “సరే... నాకో గుర్రాన్ని వదిలి మీరు పోండి. నేనొస్తా" అన్నాడు. వాళ్ళు సరేనని గుర్రాన్ని వదిలి పోయినారు.

సోమరిపోతు పెండ్లాన్ని పిలిచి "ఏమే... నాకెందుకో భయంగా వుంది. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో... నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పినాడు. 

వానికి గుర్రమెక్కడం గానీ, దాన్ని తోలడంగానీ రాదు. దాంతో నిచ్చెన తెప్పించుకోని గుర్రం ఎక్కినాడు. దాన్ని ఎట్లా తోలాల్నో అర్ధంగాక మొలతాడుకు కట్టుకున్న పిన్నీసు తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక్క గుచ్చు గుచ్చినాడు. 

అంతే... ఆ నొప్పికి తట్టుకోలేక అది రాజభవనం వైపు మెరుపు వేగంతో దూసుకు పోసాగింది. వాడు భయంతో గట్టిగా దాని మెడ కరుచుకున్నాడు. అది నిమిషాల్లో సైనికులందరినీ దాటిపోయింది.

అదే సమయంలో రాజు అంతఃపురం పైన తిరుగుతా వున్నాడు. ఆయనకు గుర్రమ్మీద దూసుకోని వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. 

“ఆహా... ఏమి వేగం... మెరుపులెక్క వస్తా వున్నాడు. రాజ్యంలో ఇంతమంది సైనికులుండి ఏం లాభం... ఏ రోజూ ఎవడూ ఇంత వేగంగా పోవడం చూడలేదు" అనుకున్నాడు. 

రాజు ఆ సోమరిపోతు సభలోకి రాగానే పెద్ద యెత్తున సన్మానించి నగలూ, వజ్రాలు బహుమానంగా ఇచ్చి “నీలాంటోడు మాకెంతో అవసరం. ఎప్పుడయినా ఏదయినా ఆపద వస్తే కబురు పంపుతాను. వచ్చి సాయం చేయండి" అని చెప్పి పంపిచ్చినాడు. వాడు నగలతో, వజ్రాల హారాలతో తిరిగి ఇంటికి రాగానే చూసి వాని పెండ్లాం సంబరపడింది. ఒకొక్కటే అమ్ముకుంటా హాయిగా కాలం గడపసాగినారు.

ఒకసారి రాజ్యంలో కొంతమంది దొంగలు పడినారు. చీకటి పడితే చాలు ఎప్పుడు ఎక్కడినుంచి ఎవరింటి మీద పడతారో తెలీదు. క్షణంలో రావడం వున్నదంతా దోచుకోవడం మరుక్షణంలో మాయమై పోవడం చేసేవాళ్ళు. సైనికులు వీధివీధినా కాపలా కాస్తా వున్నా వాళ్ళని పట్టుకోలేక పోతా వున్నారు. ప్రజలందరూ రాత్రయితే చాలు భయంతో గజగజా వణికిపోతా తలుపులేసుకోని బిక్కుబిక్కుమంటా గడపసాగినారు. దాంతో రాజు లాభం లేదనుకోని సోమరిపోతుని పిలిపించినాడు.

"ఒక్క రోజులోనే వందమందిని వుత్త చేతుల్తో చంపిన మహా వీరుడా... నీకు తెలియనిదేముంది. వూర్లో దొంగలు పడి నెలరోజుల నుంచీ ముప్పుతిప్పలు పెడతా వున్నారు. నీకు ఎంతమంది సైనికులు కావలసి వస్తే అంతమందిని తీసుకోని పో. వాళ్ళని మాత్రం దొరికితే పట్టుకో... దొరక్కుంటే చంపెయ్యి" అన్నాడు. 

ఆ మాటలింటానే సోమరిపోతు గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకు కనబడనీయకుండా “రాజా! ఈ మాత్రం పనికి మళ్ళా నాకు తోడు సైనికులెందుకు. నేనొక్కన్నే పోయి వాళ్ళని పట్టుకోనాస్తాలే" అని చెప్పి ఇంటికి పోయినాడు. 

పెండ్లాంతో “ఏమే... ఈ రోజుతో ఇంక నా పని అయిపోయినట్లే. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో... నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి రాత్రికి ఘుమఘుమలాడేలా మాంచి బిర్యానీ చేయించుకోని మూటగట్టుకోని బైలుదేరినాడు.

కొంచెం దూరం పోయినాక ఒక పెద్దతోట కనబడింది. దాంట్లోకి పోయి అంగీలో దాచి పెట్టుకున్న విషం తీసి బిర్యానీలో కలిపినాడు. ఇంక ఇది తిని చచ్చిపోతే సరి. లేకుంటే రేపు అందరి ముందూ పరువు పోతుంది అనుకున్నాడు. అంతలో వానికి బాగా నిద్ర వచ్చింది. 

"సర్లే ఎట్లాగూ చచ్చిపోయేదే గదా... కాసేపు హాయిగా నిద్రపోయి ఆ తర్వాత చచ్చిపోదాం" అనుకోని మూట పక్కనే పెట్టుకోని అట్లాగే నిద్రపోయినాడు.

ఆరోజు రాత్రి దొంగలు ఎవరింట్లో దొంగతనం చేయాల్నో ఆలోచించుకోవడానికని ఆ తోటలోనే సమావేశమయినారు. వాళ్ళకి ఘుమఘుమలాడి పోతా బిర్యానీ వాసన వచ్చింది. యాడుందబ్బా అని వెదుక్కుంటా వస్తే వీడు నిద్రపోతా కనబన్నాడు. వాళ్ళు నెమ్మదిగా వాని పక్కనున్న మూట తీసుకోని పోయి విప్పినారు. బిర్యానీ కొంచెమే వుంది. 

దాంతో “సర్లే... ఎంతుంటే ఏమిలే... వాసనే ఇంత కమ్మగా వుంటే... తింటే ఇంకెంత రుచిగా వుంటుందో" అని ఆ ముప్పయి మంది తలా ఒక ముద్ద తిన్నారు. అంతే... కాసేపటికి అందరూ విషమెక్కి ఎక్కడోళ్ళక్కడ పడి చచ్చిపోయినారు.

పొద్దున్నే ఆ సోమరిపోతు లేసి చూస్తే ఇంగేముంది. పక్కనే దొంగలు ఒకరుగాదు ఇద్దరుగాదు ముప్పయిమంది ఒకరి పక్కనొకరు చచ్చి పడున్నారు. పక్కన మూట లేకపోవడంతో వానికి విషయమంతా అర్ధమైంది. వెంటనే వురుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకోనొచ్చి ఆ శవాలన్నీ అందులో యేసుకోని రాజభవనానికి బైలుదేరినాడు. 

అట్లా పోతావుంటే దారిలో చూసినోళ్ళంతా "ఉత్త చేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై" “ఒక్క రాత్రిలో ముప్పయిమంది దొంగల్ని మట్టి కరిపించిన మహా వీరునికి జై" అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటా బండి వెనకాల్నే రాసాగినారు. ఆ అరుపులు విని రాజు బైటకు వచ్చినాడు. 

చూస్తే ఇంగేముంది బండి మీద ముప్పెమంది దొంగల్ని వేసుకోని రొమ్ము విరుచుకోని ఠీవిగా వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. 

వెంటనే రాజు మేడ దిగి వానికి ఎదురొచ్చి “భళా... వీరా... భళా... ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్కరోజులోనే ఒక్కనివే చేసి చూపించినావు. నువ్వురా వీరునివంటే" అని మెచ్చుకోని పెద్ద ఎత్తున బండి నిండా నగలు, వజ్రాలూ ఇచ్చి పంపిచ్చినాడు. అట్లా కొద్దిరోజులు గడచిపోయినాయి. 

అంతలో యాన్నుంచొచ్చిందో ఏమోగానీ ఒక పెద్దపులి వూరి మీదకొచ్చి పడింది.

రాత్రయితేచాలు దొరికినోన్ని దొరికినట్టు చంపి తినేయసాగింది. సైనికులు దాన్ని పట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించినారు గానీ అది ఎవరికీ దొరకక పోగా వాళ్ళనే ఒక పదిమంది దాకా చంపేసింది.

దాంతో పులి పేరు చెబితే చాలు అందరూ భయంతో గజగజా వణికిపోసాగినారు. చీకటి పడితే చాలు ఎంత పనున్నా సరే ఎక్కడోళ్ళక్కడ పరుగుపరుగున ఇళ్ళకు చేరుకోని తలుపులు బిగించుకోని లోపలనే కూచోసాగినారు.

దాంతో రాజు ఇట్లాగయితే లాభం లేదనుకోని సోమరిపోతుని పిలిపించినాడు. 

“ఉత్త చేతుల్తో వందమందిని, ఒక్క రాత్రిలో ముప్పయి మంది దొంగల్ని మట్టి కరిపించిన మహావీరుడా... నీకు తెలియనిదేముంది. వూర్లోకి ఒక పెద్దపులి వస్తూ జనాలని ముప్పుతిప్పలు పెడతా వుంది. నీకు ఎంతమంది సైనికులు కావలిస్తే అంత మందిని తీసుకోని పో. కానీ దాన్ని మాత్రం వదలొద్దు. దొరికితే పట్టుకో... దొరక్కుంటే అక్కడికక్కడే చంపెయ్యి" అన్నాడు. 

ఆ మాటలకా సోమరిపోతు భయంతో గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకు కనబడనీయకుండా పెద్ద మొనగాని లెక్క “ఈ మాత్రం దానికి మళ్ళా సైనికులెందుకు రాజా. నేనొక్కన్నే పోయి దాన్ని పట్టుకోనొస్తాలే" అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయినాడు. పెండ్లాంతో “ఏమే... ఈ రోజుతో ఇంక నా పని అయిపోయినట్లే. ఎందుకయినా మంచిది నే పోగానే పెట్టె సర్దుకోని పుట్టింటికి పో. నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి నిచ్చెనేసుకోని గుర్రమెక్కి రాత్రి వూర్లోకి బైలుదేరినాడు.

అది అమావాస్య. చుట్టూ చీకటి. దారిలో ఒక్కరు గూడా కనబల్లేదు. అందరూ తలుపులేసుకోని ఎవరిండ్లలో వాళ్ళు దాచి పెట్టుకున్నారు. సోమరిపోతుకు భయంతో ఒళ్ళంతా గజగజా వణికిపోసాగింది. గుర్రాన్ని తీసుకోని పోయి ఎవరూ లేని ఒక చోట కట్టేసి ఆ చెట్టు కిందే నిండుగా కంబలీ కప్పుకోని పన్నుకున్నాడు.

అర్ధరాత్రయింది. పెద్దపులి వూరంతా తిరిగి తిరిగి అలసిపోయింది. యాడా దానికి తినడానికి ఏమీ దొరకలేదు. అప్పటికీ నాలుగు రోజుల నుంచి దానికి అదే పరిస్థితి. అన్ని ఇండ్లు మూసేసున్నాయి. కోళ్ళు, మేకల్తో సహా అన్నీ లోపల పెట్టి తాళాలేసుకుంటాన్నారు. తినడానికి తిండి లేక అది నీరసంగా అయిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేక నెమ్మదిగా సోమరిపోతు పన్నుకున్న చెట్టు దగ్గరకు వచ్చింది. పెద్దపులిని చూడగానే గుర్రం భయపడి తాడు తెంపుకోని వురకసాగింది. కానీ పెద్దపులికి దాని వెంటపడి వేటాడే ఓపిక లేదు. దాంతో అట్లాగే నెమ్మదిగా వాని దగ్గరకు రాసాగింది. అంతలో ఆ అలికిడికి ఆ సోమరిపోతు కప్పుకున్న కంబలితో సహా లేచినాడు. పెద్దపులికి చీకట్లో అదేందో అర్థం కాలేదు. 

"ఇదేం జంతువబ్బా... నల్లగా ఇంత పెద్దగా వుంది. ఈ అడవిలో నేనెప్పుడూ చూడలేదే" అని భయంతో వణికిపోసాగింది. 

అంతలో ఆ సోమరిపోతు నిద్రమబ్బులో ఎదురుగా వున్నది వాని గుర్రమే అనుకోని దాన్ని పట్టుకోని తాడుతో దూరంగా చెట్టుకు కట్టేసి మళ్ళా నిద్రపోయినాడు. దాంతో పెద్దపులికి ఆ రాత్రిగూడా తిండి లేక ఆకలికి తట్టుకోలేక ఆఖరికి అది అట్లాగే చచ్చిపోయింది.

ఆ సోమరిపోతు పొద్దున్నే లేసి చూస్తే ఇంగేముంది... పెద్దపులి చచ్చిపోయి కనబడింది. వెంటనే వాడు వురుక్కుంటా పోయి ఒక ఎద్దుల బండి తీసుకోనొచ్చి దాని శవాన్ని అందులో యేసుకోని రాజభవనానికి బైలుదేరినాడు. అట్లా పోతావుంటే దారిలో చూచినోళ్ళంతా "ఉత్త చేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై” “ఒక్క నిమిషంలోనే పెద్దపులిని మట్టి కరిపించిన మహావీరునికి జై” అంటూ గుంపులు గుంపులుగా అరుచుకుంటా బండి వెనకాల్నే రాసాగినారు. 

ఆ అరుపులు విని రాజు బైటకు వచ్చినాడు. చూస్తే ఇంగేముంది బండి మీద పెద్దపులి శవాన్ని వేసుకోని రొమ్ము విరుచుకోని ఠీవిగా వస్తా వున్న సోమరిపోతు కనబన్నాడు. వెంటనే రాజు మేడ దిగి వానికి ఎదురొచ్చి “భళా వీరా... భళా... ఇంతమంది సైనికులుండి ఇన్ని రోజులుగా చేయలేని పని ఒక్కరోజులోనే ఒక్కనివి చేసి చూపించినావు. నీలాంటి వీరుడు మూల్లోకాల్లోనూ యాడా వుండడు" అని మెచ్చుకోని పెద్ద ఎత్తున గౌరవించి బండి నిండా బంగారం, వజ్రాలూ, నగలూ ఇచ్చి పంపిచ్చినాడు.

అట్లా కొద్దిరోజులు గడిచి పోయినాయి. మొగుడూ పెండ్లాలు హాయిగా రాజిచ్చిన బంగారం, నగలూ అవసరానికి అమ్ముకుంటా కాలు మీద కాలేసుకోని కాలం గడపసాగినారు. 

అంతలో పక్క ఊరి రాజు ఈ రాజ్యంపైకి దండయాత్రకి బైలుదేరినాడు. వూరి పొలిమేరల్లో సైన్యాన్ని ఆపి "మర్యాదగా వచ్చి లొంగిపోయి కప్పం కట్టి నాకు సామంతునిగా వుంటావా... లేక దాడి చేసి రాజ్యం మొత్తం ఆక్రమించుకోమంటావా ఏదో ఒకటి చెప్పు" అని కబురు పంపించినాడు. రాజుకు ఏం చేయాల్నో పాలుపోలేదు. అవతల సైన్యం చానా పెద్దది. గెలవడం చానా కష్టం. అట్లాగని లొంగిపోదామా అంటే ఆ అవమానం కన్నా చావడం మేలు అనిపించింది. ఆ సమయంలో రాజుకి సోమరిపోతు గుర్తుకొచ్చినాడు. వెంటనే సైనికులను పంపి వాన్ని పిలిపించినాడు.

"ఉత్త చేతుల్తో వందమందిని, ఒక్కరాత్రిలో ముప్పయిమంది దొంగల్ని, ఒక్క నిమిషంలోనే పెద్దపులిని మట్టికరిపించిన మహావీరుడా... నీకు తెలియనిదేముంది. పక్క ఊరి రాజు మన మీదకు దండయాత్రకొచ్చినాడు. ఇది మనవూరి పరువు మర్యాదలకు సంబంధించిన విషయం. నీకు ఎంతమంది సైనికులు కావాలంటే అంతమందిని తీసుకోనిపో. ఇంకెప్పుడూ నిన్ను ఏ కోరికా కోరి ఇబ్బంది పెట్టను. ఈ ఒక్కసారికి సాయం చేయి చాలు" అన్నాడు.

యుద్ధం అనే మాట వినగానే సోమరిపోతు గజగజా వణికిపోయినాడు. అయినా దాన్ని బైటకి కనబడనీయకుండా “రాజా... ఇదే ఆఖరిసారి అంటా వున్నావు గదా... అట్లాగే చేద్దాం. ముందు నేను పోతా...

వెనుక సైన్యాన్నంతా రమ్మను" అని చెప్పి ఇంటికి పోయినాడు.

పెండ్లాంతో "ఏమే... ఇన్ని రోజులూ ఏదో అదృష్టం బాగుండి తప్పించుకున్నాగానీ... ఇంగ ఈ రోజుతో నా పని అయిపోయినట్లే... ఎందుకయినా మంచిది. నే పోగానే పెట్టి సర్దుకోని డబ్బులు తీసుకొని పుట్టింటికి పో. నాకేమన్నా అయితే పిల్లలు జాగ్రత్త" అని చెప్పి బైలుదేరినాడు.

ఆ సోమరిపోతు పోయేసరికి సైనికులంతా సిద్ధంగా వున్నారు. ఒక మంచి నల్లని మేలు జాతి గుర్రాన్ని సోమరిపోతు కోసం సిద్ధంగా వుంచినారు. రాగానే అందరూ "మహావీరునికి జై" 

"మహా వీరునికి జై" అని అరుస్తా భుజాల మీదకు ఎత్తుకొని పోయి గుర్రమ్మీద కూచోబెట్టినారు. 

"మహావీరా... ఇది అట్లాంటిట్లాంటి మామూలు అల్లాటప్పా గుర్రం కాదు. దీనంత వేగంగా వురికే గుర్రం ఈ చుట్టుపక్కల ఏడేడు లోకాల్లో యాడా లేదు. నీ కోసమే ప్రత్యేకంగా తెప్పించినాం" అన్నారు. ఆ గుర్రాన్ని చూడగానే సోమరిపోతు భయంతో గజగజా వణికిపోయినాడు. యాడ కిందపడిపోతానో ఏమో అనే భయంతో “రేయ్... నన్ను గుర్రానికి గట్టిగా తాళ్ళతో కట్టెయ్యండ్రా" అన్నాడు. 

అది విని రాజు "మహావీరా ఏందిది" అన్నాడు ఆచ్చర్యంగా. దానికి సోమరిపోతు వెంటనే "రాజా... యుద్ధరంగంలోంచి నేనన్నా వెనక్కి రావాలి. నా శవమన్నా వెనక్కి రావాలి. అంతేగానీ పొరపాటున గూడా శత్రువులకు వెన్ను చూపగూడదు. కత్తి గుండెల్లో దూసుకుపోయినా సరే చివరి రక్తం బొట్టు వరకూ పోరాడాలి. అందుకే ఇలా కట్టేసుకుంటున్నా" అన్నాడు. ఆ మాటలినగానే సైనికులందరూ "మహావీరునికి జై" "మహావీరునికి జై" అని అరుస్తా తాము గూడా గుర్రాలకు కట్టించుకోసాగినారు.

సోమరిపోతు సైనికులతో "ముందు నేనొక్కన్నే పోతా... నేను పోయిన అర్ధగంటకు మీరు బైలుదేరండి" అని చెప్పి బైలుదేరినాడు. కొంచం దూరం పోగానే బతికుంటే సాలు బలుసాకైనా తిని బతకొచ్చు... సైనికులు వచ్చేసరికి ఇక్కడినుంచి ఎవరికీ తెలియని వేరే వూరికి పారిపోవాలి" అనుకోని పిన్నీసు తీసి గుర్రం మెడ మీద గట్టిగా ఒక్క గుచ్చు గుచ్చినాడు. అంతే ఆ గుర్రం అదిరిపడి సర్రుమని ఉరకడం మొదలు పెట్టింది.

ఆ గుర్రం అట్లాంటిట్లాంటి మామూలు గుర్రం కాదు కదా... అప్పటికే ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న గుర్రం. దాంతో శత్రువులు వున్న వైపే వురకడం మొదలుపెట్టింది. అది చూసి భయపడిన సోమరిపోతు దాన్ని ఆపాలని ఎంత చూసినా అది ఆగకుండా మరింత వేగంగా మెరుపులెక్క దూసుకుపోసాగింది. ఆ వేగానికి సోమరిపోతుకి కళ్ళు తిరగసాగినాయి. భయంతో ఒళ్ళంతా చెమట పట్టసాగింది. ఎట్లాగయినా సరే దాన్ని ఆపాలనుకున్నాడు.

అంతలో ఎదురుగా రెండు పెద్ద తాటి చెట్లు పక్కపక్కనే కనబన్నాయి. గుర్రాన్ని వాటి మధ్యలో వురికించినాడు. తాటి చెట్లు దగ్గరికి రాగానే వాటిని గట్టిగా పట్టుకుంటే గుర్రం ఆగిపోతుందిలే అనుకున్నాడు.

కానీ ఆ తాటి చెట్లకు మొదలు దగ్గర అప్పటికే బాగా చెదలు పట్టేసినాయి. లోపలంతా డొల్లడొల్ల అయిపోయి తేలికగా అయిపోయినాయి. ఈ రోజో రేపో కూలిపోవడానికి సిద్ధంగా వున్నాయి. అది వానికి తెలీదు. గుర్రం వాటి మధ్యలోంచి పోతుండగానే చేతుల్లో రెండుచెట్లు గట్టిగా పట్టేసుకున్నాడు. 

కానీ గుర్రం మెరుపులెక్క దూసుకోని పోతావుంది గదా... ఆ వేగానికి ఆ రెండు చెట్లు వేళ్ళతో సహా లేచి పైకి వచ్చేసినాయి.

గుర్రమ్మీద రెండు చేతుల్లో రెండు తాటి చెట్లను పట్టుకోని దూసుకొస్తావున్న వాన్ని చూడగానే శత్రు సైన్యాలు అదిరిపడినాయి. 

“రేయ్... వుత్త చేతుల్తో వందమందిని ఒక్కరోజులో చంపిన మహావీరుడు తాటి చెట్లు ఎత్తుకోని చిరుతపులిలెక్క వస్తా వున్నాడు. వానికి దొరికినామంటే మనపని అయిపోయినట్లే. సున్నంలోకి ఎముకలు గూడా మిగలవు. పారిపోయి ప్రాణాలు కాపాడుకోండ్రోయ్" అంటూ గట్టిగా అరుస్తా అందరూ తలా ఒక దిక్కు కిందామీదా పడి వురకసాగినారు. సోమరిపోతు అక్కడి కొచ్చేసరికి ఒక్కడుగూడా మిగలలేదు.

వాని వెనుక అర్ధగంటకు బైలు దేరిన సైనికులు అక్కడికి చేరుకునే సరికి సోమరిపోతు ఒక్కడే నవ్వుతా కులాసాగా కనబన్నాడు. 

వెంటనే వాళ్ళు “ఉత్తచేతుల్తో వందమందిని చంపిన మహావీరునికి జై" 

“ఒక్క నిమిషంలోనే శత్రు సైన్యాలనంతా పారద్రోలిన మహావీరునికి జై" అంటూ వాన్ని గుర్రమ్మీద నుంచి దించి భుజాల మీదకు ఎత్తుకోని తప్పట్లు కొట్టుకుంటా, చిందులు తొక్కుకుంటా, బాణాలు కాల్చుకుంటా రాజు దగ్గరికి తీసుకోనొచ్చినారు. రాజు వురుక్కుంటా మేడ దిగొచ్చి “శభాష్ వీరా... శభాష్... వీరునివంటే నువ్వే ఒక్క రక్తం చుక్క గూడా చిందకుండా విజయం సాధించినావ్... నీలాంటోడు ఒక్కడుంటే చాలు... ఈ ప్రపంచాన్నే జయించొచ్చు" అంటూ మెచ్చుకోని వాళ్ళ రాజ్యానికి సైన్యాధ్యక్షునిగా చేసినాడు. 

అప్పటికే సోమరిపోతు వీరత్వం గురించి చుట్టుపక్కల రాజ్యాలకంతా తెలిసిపోవడంతో ఆ రాజ్యంవైపు కన్నెత్తి చూడడానికి గూడా అందరూ భయపడిపోయినారు. దాంతో ఆ సోమరిపోతు హాయిగా కాలుమీద కాలేసుకోని కులాసాగా జీవితమంతా గడిపినాడు.

డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

English Activity 

సంఖ్యలతో ఆట





We Love Reading Summer Activities ( Class 6-10) @27.04.24

 పిండి బొమ్మ వీరుడు (సంయుక్త అక్షరాలు లేనికథ) డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

ఒకూరిలో ఒక ముసలోడు వుండేటోడు. వానికి అన్నీ వున్నాయి గానీ పిల్లల్లేరు. దాంతో ఒకరోజు గోధుమపిండితో ఒక చిన్న బొమ్మ చేసి, దానినే సొంత కొడుకులా చూసుకోసాగాడు. ఆ పిండిబొమ్మను ఉయ్యాలలో పడుకోబెట్టి

''పడుకో...పడుకో...

హాయిగా పడుకో... 

పిండి బొమ్మ పిల్లోడా 

హాయిగా పడుకో''

అని పాట పాడతా వుండేవాడు.

ఒకరోజు ఆకాశంలో దేవతలు పోతా పోతా ఇది చూసినారు. ''అరెరే... పాపం... ఈ ముసలోనికి ఎవరూ లేరే'' అని జాలిపడి ఆ బొమ్మకే జీవం పోసి పోయినారు. ఉయ్యాలలోంచి కెవ్వుమని కేక వినబడగానే ముసలోడు అదిరిపడి లేచి చూసినాడు. ఇంకేముంది పిండిబొమ్మ కదులుతా కనబడింది.

ముసలోడు సంబరంగా ఆ పిండిబొమ్మను బైటకి తీసినాడు.

''ఏడవకూ... ఏడవకూ... 

పిండిబొమ్మ పిల్లోడా...

నీ కళ్ళలో నీళ్ళు 

నే చూడలేను'' అని జోలపాట పాడతా ముద్దు పెట్టుకున్నాడు.

ఆ రోజు నుండీ ఆ ముసలోడు పిండిబొమ్మ పిల్లోన్ని కన్నకొడుకు లెక్క బాగా చూసుకునేటోడు.ఆ ముసలోడు ఒకప్పుడు రాజు దగ్గర సైనికునిగా పని చేసినోడు. దాంతో ఆ పిండిబొమ్మకు కత్తి తిప్పడం, గుర్రం తోలడం, బాణాలు ఎయ్యడం అన్నీ నేరిపించి పెద్దవీరునిగా తయారు చేసినాడు.

ఒకరోజు ఆ పిండిబొమ్మ వీరుడు ''తాతా... తాతా... నేను అలా అడవిలోనికి పోయి ఏయే జంతువులు వున్నాయో తెలుసుకుంటా'' అని చెప్పి అడవిలోనికి పోయినాడు.

అలా పోతా వుంటే వానికి ఒకచోట జంతువులన్నీ గుంపుగా చేరి కనబన్నాయి. ''ఎందుకబ్బా... అలా గుంపుగా వున్నాయి'' అని పోయి చూసినాడు. అక్కడ జంతువులన్నీ తమలో ఒకరిని రాజుగా ఎన్నుకోవాలని అనుకుంటున్నాయి. పెద్ద పెద్ద జంతువులన్నీ నేను రాజునంటే, నేను రాజునంటూ అరచుకోసాగినాయి.

మన పిండిబొమ్మ వీరుడు అది చూసి ఆ జంతువుల దగ్గరికి పోయినాడు.జంతువులన్నీ వానిని వింతగా చూసినాయి. వెంటనే ఆ పిండి బొమ్మ వీరుడు గట్టిగా

''పక్షిలాగ ఎగురుతా 

చేపలాగ ఈదుతా 

లేడిలాగ వురుకుతా 

పులిలాగ దుంకుతా 

నా అంత వీరుడు 

లోకాన లేడులే

పిండిబొమ్మ వీరున్ని 

నేనేలే రాజుని'' అని పాట పాడినాడు.

అది విని జంతువులన్నింటికీ చానా కోపమొచ్చింది.

లేడిపిల్ల కోపంగా వాని ముందుకొచ్చి ''గింత కూడా లేవు. నీవు మా రాజువా. ఏదీ నా అంత వేగంగా వురుకు చూద్దాం'' అనింది.

పిండిబొమ్మ వీరుడు పకపకపక నవ్వుతా

''వురుకుతా...వురుకుతా...వేగంగా

ముట్టుకో...ముట్టుకో...చేతనయితే

నా అంత వీరుడు లోకాన లేడులే 

దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను'' అని పాట పాడతా వురకడం మొదలు పెట్టినాడు.

లేడిపిల్ల వానిని అంటేసుకోడానికి ఎంటబడింది. కానీ వాడు దొరికితేనా... ఆ పక్కకురికి ఈ పక్కకురికి... దాన్ని ముప్పు తిప్పలు పెట్టినాడు. పాపం వురికీ వురికీ ఆ లేడిపిల్లకు కాళ్ళు నొప్పి పెట్టి ''ఇంగ నా చేతగాదు. నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.

అది చూసి ఒక గద్ద ముందుకొచ్చింది. లేడిపిల్లను ఓడియ్యడం కాదు దమ్ముంటే నాతో పోటీకి రా'' అనింది. పిండిబొమ్మ వీరుడు పకపకపకమని నవ్వుతా ఒక గాలిపటం తయారు చేసినాడు. దాని దారం పట్టుకోని రయ్యిమని గాల్లోకి ఎగిరినాడు.

''ఎగురుతా...ఎగురుతా...వేగంగా 

ముట్టుకో...ముట్టుకో...చేతనయితే 

నా అంత వీరుడు లోకాన లేడులే 

దమ్ముంటే రమ్మను ఓడించి పొమ్మను''. అని పాట పాడతా గిరగిరగిర తిరుగుకుంటా పైపైకి పోయినాడు.

గద్ద వాన్ని అంటేసుకోడానికి వెంటపడింది. కానీ వాడు దొరికితేనా... అలా ఎగిరి ఇలా ఎగిరి... దాన్ని ముప్పు తిప్పలు పెట్టినాడు. పాపం ఎగిరీ ఎగిరీ ఆ గద్దకు రెక్కలు నొప్పి పుట్టి ''ఇంగ నా చేతగాదు. నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.

అది చూసి ఒక ఏనుగు ముందుకొచ్చింది. ''లేడినీ, గద్దనీ ఓడియ్యడం కాదు. దమ్ముంటే నాతో పోటీకి రా'' అని సవాలు చేసింది. వాడు నవ్వుతా ''సరే... ఏం పోటీ'' అన్నాడు. ఏనుగు ఒక పెద్ద కొబ్బరి చెట్టును చూపిచ్చి ''నువ్వు దీనిని పడగొట్టాలి. నేను అదిగో ఆ కొబ్బరి చెట్టును పడగొడతాను. ఎవరు ముందు పడగొడితే వాళ్ళే గెలిచినట్టు'' అనింది. పిండిబొమ్మ వీరుడు సై అన్నాడు.

ఏనుగు తొండంతో చెట్టు పట్టుకోని పీకడం మొదలు పెట్టింది. పిండిబొమ్మ వీరుడు ఒక మాంచి గొడ్డలి తీసుకోని దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ... దెబ్బ మీద దెబ్బ... రపరపరప ఏసినాడు. అంతే... అంత పెద్ద చెట్టు ఒక్కసారిగా ఫటఫటఫటమని కూలిపోయింది. అది చూసి ఏనుగు ''నువ్వే గెలిచినావు'' అని ఒప్పేసుకోనింది.

అప్పుడు ఎలుగుబంటి ముందుకు వచ్చింది.''లేడినీ, గద్దనీ, ఏనుగునీ ఓడియ్యడం కాదు. ఈ అడవిలో ఒక పెద్దపులి వుంది. అది కనబన్న జంతువునల్లా చంపి తింటా వుంది. నీవు గనుక దానిని చంపినావనుకో నువ్వే మా రాజువి. ఇదే చివరి పోటీ'' అనింది.

మిగతా జంతువులన్నీ ''ఔ... ఔ...'' అన్నాయి.'

'సరే'' అని మన వీరుడు పులి ఎక్కడుందో కనుక్కోని దాని దగ్గరికి పోయినాడు. ''ఏయ్‌... దొంగపులీ... అమాయకుల మీదకు పోవడం కాదు. నా మీదకు రా...దమ్ముంటే'' అని తొడ కొట్టినాడు. పులి కోపంగా వాన్ని చంపడానికి మీదికొచ్చింది. పిండిబొమ్మ వీరుడు వెంటనే బాణాలు తీసినాడు. ఏటు మీద ఏటు... ఏటు మీద ఏటు...ఏటు మీద ఏటు... గుక్క తిప్పుకోకుండా ఏసినాడు.

అంతే... ఆ దెబ్బలకు తట్టుకోలేక పులి అక్కడికక్కడే గిలగిలగిల కొట్టుకుంటా చచ్చిపోయింది.

జంతువులన్నీ అది చూసి సంబరపడినాయి. ఉరుక్కుంటా వచ్చి వాని చుట్టూ చేరినాయి.

''పక్షిలాగ ఎగిరినావు 

చేపలాగ ఈదినావు 

లేడిలాగ వురికినావు 

పులిలాగా దుంకినావు 

నీ అంత వీరుడు 

లోకాన లేడులే 

పిండిబొమ్మ వీరుడా 

నువ్వే మా రాజువి'' అంటూ వాన్ని ఏనుగు మీద కూచోబెట్టి... సంబరంగా ఎగురుకుంటా దుముకుకుంటా అడవి అంతా తిప్పి ఊరేగించినాయి.

డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

English:Daily Used English Setences



Mathematics: Maths Knowing our Numbers 

School Complex Meetings Feedback Form

All stakeholders in the districts, including District Education Officers (DEOs), Additional Project Coordinators (APCs), sectoral officers, DIET faculty, MEO-1 &2, school complex Headmasters, and teachers, are requested to open the provided link and submit feedback on the school complex meetings organized last year. Please ensure to submit your feedback promptly.

School Complex Meetings Feedback Form

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More

Andhra Teachers

Top