అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జీవిత విశేషాలు

 నాటి గుడివాడ నివాసి...అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గుడివాడ గడ్డ నుండే ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం నిరహారదీక్ష కు పూనిన   సంకల్పం నకు సాక్షిగా ఒక గుడివాడ యువ పత్రికా విలేఖరి, అమరజీవి మరణం తదనంతరం ఉన్న చీకటి కోణాల్ని, పరిశీలించి తెలుగువారికి,ముఖ్యంగా గుడివాడ ప్రాంత ప్రజలకు అందించిన నేటి విద్యావేత్త,,నాటి పరిశోధనాత్మక  విలేఖరి డా:ఎమ్.ఎస్.వి.సత్యనారాయణ బాబు గారు  పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భాన అందించిన వ్యాసం...ప్రతితెలుగు వారు...ముఖ్యంగా గుడివాడ ప్రాంతీయులు తెలుసుకోవలసిన విషయం.... 

     పొట్టిశ్రీరాములుగారినిగుండెల్లోదాచుకున్నగుడివాడ


నేడు అమరజీవి పొట్టిశ్రీరాములుగారి జయంతి. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన 58 రోజులపాటు మద్రాసు నగరంలో నిరాహార దీక్ష చేసి ఆ దీక్షలోనే చనిపోయారు. ఆయన శవాన్ని మోసేందుకు కనీసం నలుగురు మనుషులు కూడా లేని నిస్సహాయ స్థితిలో అనాధగా అభాగ్యుడిగా ఆయన అసువులు బాసారు. నిజానికి  పొట్టి శ్రీరాములుగారి గురించి ఆయన చేసిన త్యాగం గురించి చరిత్ర ఒక నల్లని దుప్పటి కప్పుకుంది. అమరజీవి పేరుతో ఈరోజుకు మాత్రం ఒకసారి ఆయనను తలుచుకుని అమర్ రహే అనుకుని మన పని మనం చేసుకుంటాం. ఆర్యవైశ్యులు ఆయన కులస్తులు కాబట్టి వాళ్ళే చూసుకుంటారని ఒక గుడ్డి కులం ముద్రను ఆయనకు వేసి మిన్నకుంటాం. ఎంత డొల్లతనం మన తెలుగువారిది. ఏది సీరియస్ గా తీసుకోవాలో ఏది వదిలిపెట్టాలో దిశ దశ లేక తెలుగుజాతి ఇలా నీరుగారిపోవటమే నేటికీ దేశ స్థాయిలో తెలుగువారంటే చేతగానితనం అనిపించుకుంటానికి కారణం. పక్కనే ఉన్న తమిళులు భాషా, సంస్కృతి , సంప్రదాయాలతో తమ జాతి ప్రత్యేకత కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉంటుంటే దానిని గొప్పగా చెప్పుకుంటాం గాని మనం మాత్రం మన జాతి పురుషుల గురించి కూడా సరిగ్గా తెలుసుకోము. ఇది ఎవరినో నిందించటానికి కాదు. మన తెలుగుజాతి కోసం నిండుప్రాణాలను తృణప్రాయంగా బలిచేసుకుని మనకు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతిని గురించి నేటి తరం కనీసం తెలుసుకోకపోతోందే అనే ఆవేదన.


          పొట్టిశ్రీరాములుగారిది నెల్లూరు జిల్లా. ఐటిఐ చదువుకుని  మద్రాసులో రైల్వే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన పట్ల విధి చిన్నచూపు చూడటంతో ఒకే సంవత్సరంలో భార్యా బిడ్డా తల్లీ కూడా వరుసగా చనిపోవటంతో ఆయన ఖిన్నుడైపోయాడు. ఇక తన జీవితానికి అర్ధం లేదని కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో గాంధీజి మద్రాసు పర్యటన ఆయన ఆలోచనను మార్చివేసింది. ఎవరికీ కొరగాని ఈ జీవితం బాపూజి సబర్మతీ ఆశ్రమంలో ఆయన శిష్యరికంలో గడపడమే సబబని తోచి సబర్మతీ వెళ్ళిపోయారు. అక్కడ గుడివాడ నుంచి వచ్చిన యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం కలిసి ఇద్దరూ తెలుగువాళ్ళు కావటంతో స్నేహం కుదిరింది. విరాగులు, స్వాతంత్ర్య సమరయోధులతో సబర్మతి నిండిపోయింది. గాంధీజీకి వారిపట్ల విసుగేసింది. నా చుట్టూ చేసి భజన చేయటం కంటే పల్లెసీమలకు వెళ్ళి ప్రజలను అహింసా పద్దతిలో స్వాతంత్ర్యం కోసం పోరాడటానికి సిధ్దంగా తయారుచేయండి వెళ్ళండి అని వాళ్లకు ఉద్భోద చేసారు. తన ఊర్లో తనకు ఎవరూ లేరని బాధపడుతున్న శ్రీరాములను యెర్నేని సుభ్రహ్మణ్యం తాను గుడివాడ దగ్గర స్థాపించిన గాంధీ ఆశ్రమంకు రమ్మని ఇద్దరం కలిసి పనిచేసుకుందామని ఆహ్వానించారు. వెంటనే గాంధీజీ కి చెప్పిగుడివాడ బయలుదేరారు. కొమరవోలు చెంత గల గాంధీ ఆశ్రమానికి గాంధీజీ 3 సార్లు వచ్చివెళ్ళిన ఘనత ఉంది. పొట్టిశ్రీరాములు తన మకాం గాంధీ ఆశ్రమానికి మార్చారు. కానీ గుడివాడ కూడలి ప్రాంతం కావటంతో ప్రతిరోజూ నడుచుకుంటూ7 కిలోమీటర్లు దూరంలోని గుడివాడకు వచ్చేవారు. ఆయనకు వైద్యం తెలుసు. తన ఆయుర్వేదమూలికల కోసం గాంధీ ఆశ్రమంలో రెండు ఎకరాలు ప్రత్యేకం ఔషధ మొక్కలు నాటుకుని ఉచితంగా వైద్యం చేసేవారు. మానేపల్లి మల్లిఖార్జున గుప్త, కూరాళ్ళ భుజంగభూషణరావు, మెండా నాగయ్య, రావూరి అర్జనరావు, గోరా తదితరులతో నిత్యం గాెంధీజీ కార్యక్రమాల గురించి చర్చించేవారు. గోరా నాస్తిక సభలకు కూడా వెళ్లేవారు. హరిజన దేవాలయ ప్రవేశం అంగలూరులో నిర్విహించారు. విదేశీ వస్త్ర బహిశ్కరణ, స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ నిత్యావసర సరుకుల పై కంట్రోల్ పెట్టడాన్ని వ్యతిరేకించి గుడివాడ బజార్లలో బియ్యం రాసులుపోసి అమ్మి పోలీసుల మర్యాదలు కూడా అందుకున్నారు. 


        పదేళ్ళు గడిచిపోయాయి. మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం. ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు. తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు. 1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది. దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. ఎవరూ లేని తన జీవితం తెలుగువారి ఆత్మగౌరవానికి ఉపయోగపడనప్పుడు వేస్ట్ అని మిత్రుడు సాధు సుభ్రహ్మణ్యంతో కూర్చిని ఒప్పించి తాను చనిపోయైనా సరే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధిస్తానని చెప్పారు. ఆయన ఆఖరి భోజనం వడ్డించిన 12 ఏళ్ల పోతరాజు రాధామనోహరి చెబుతూ ఆయన ఎప్పుడూ మజ్జిగన్నం బెల్లంతో తినేవారు. అదే వడ్డించాను. ఇదే నా ఆఖరి భోజనం అని చెప్పారు.అంది. 


              సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్లారా అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టిశ్రీరాములు ఒంటరివాడైపోయాడు. యెర్నేని సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఆయన వెంట ఎవరూ లేరు. అయినా తన దీక్షను పొట్టిశ్రీరాములు వదల్లేదు. 9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందని అనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అదీ తెలుగువారి ఐక్యత. సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని గ్రహించటంలో అంతా రాజాజీ బుట్టలో పడ్డారు. తెలుగునాయకులంతా మొఖం చాటేశారు. 58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ లేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించి వెళ్ళారు. కేవలం తన బాధనంతా మిత్రులకు లేఖల్లో వెళ్ళబోసుకున్నారు శ్రీరాములు. వారిలో ముఖ్యులు సాధు సుబ్రహ్మణ్యం గారి అల్లుడు ముసునూరి భాస్కరరావు. కూరాళ్ల భుజంగం తదితరులు. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. ఆ బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగుల నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా  నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్యటానికి 58 రోజులుపట్టింది. ఎంత దారుణమరణవేదన అనుభవించి తెలుగువారి కోసం ఆయన అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు. 


            ఇక మరణించాక మరీ దారుణం ఎదురైంది. తెలుగువారి హీన దీన హైన్య చాతకానితనం ఎటువంటిదంటే ఆయన శవాన్ని ముట్టుకోవడానికి కూడా నలుగురు తెలుగువాళ్ళు రాలేదు. ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా స్పందించలేదు. చివరికి ఒంటరివాడిగా ఉన్న గుడివాడ సాధు సుబ్రహ్మణ్యం కనీసం మన గుడివాడ వాళ్ళవైనా సహాయం అడిగి శవదహనం చేద్దామని ఆశయాన్ని చంపుకునిి వ్యక్తిగత భిక్షగాడిగా గుడివాడకు చెందిన సినీగాయకుడు ఘంటసాల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి మన గుడివాడ నుండి వచ్చాడు గనుక మనమైనా సాగనంపుదాం అని ఒప్పించి తెచ్చారు. ఘంటసాల వెంట మోపర్రు దాసు అనే కళాకారుడు నేను గుడివాడ వాడినే కదా నేనూ వస్తానని వచ్చారు. శవాన్ని తాటాకులతో కాకులు పొడవకుండా కప్పివచ్చిన సుబ్రహ్మణ్యాన్ని శవం ఎక్కడా అని ఘంటసాల అడిగారు.   ఒక్కొక్క తాటాకూ తీసి శవాన్ని చూస్తున్న ఘంటసాల గుండె కరిగిపోయింది. మరణం ఇంత దారుణంగా ఉంటుందా అని హతాశుడైపోయాడు. ఎవరి కోసం చచ్చిపోయాడు ఆ దీనుడు అని కన్నీరుమున్నీరు అయిపోయారు. వాంతు చేసుకున్నారు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి శవాన్ని ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదు అని తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఒక ఎద్దులబండి మాట్లాడి శవాన్ని అందులోకి ఎక్కించారు. అప్పటికప్పుడే ఆశువుగా ఘంటసాల తన వీరకంఠాన్ని ఎలుగెత్తి తెలుగుజాతి పౌరుషం చచ్చిందని , చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు బాసిన అమరజీవి వయ్యా శ్రీరాములు నువ్వు అంటూ గొంతెత్తి పాడతూ శవయాత్ర ప్రారంభించారు.


           గుండెల్ని పిండే ఘంటసాల మాటలు పాటలకు మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీ ముందుగా శవం వెళ్తున్న సమయంలో విన్న కాలేజి కుర్రాళ్ళు పౌరుషంతో అమరజీవి జోహార్ అంటూ బండివెంట అరుస్తూ యాత్రలో చేరారు. అమరజీవి మరణవార్త టెలిగ్రాం ద్వారా ఆంధ్రకేసరికి తెలపటంతో ఆయన మెయిల్ కి మద్రాసు వచ్చారు. సరిగ్గా ఆ సమయానికి శవయాత్ర మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ కు చేరింది. శ్రీరాములు దారుణశవ పరిస్తితిని చూడగానే ఆంధ్రకేసరి ఆవేశం కట్టలు తెంచుకుంది. బూతుపురాణంతో తెలుగుజాతి చాతకానితనాన్ని ఆయన చీల్చిచెండాడుతూ పనికిరాని తెలుగుజాతి నాకొడక....రా అంటూ పెట్టిన పెడబొబ్బలకి ఎలా కదిలారో లక్షలాది మంది తెలుగువారు క్షణాల్లో మద్రాసు నగరం మంటల్లో తగలబడింది. షాపులు లూటీ అయ్యాయి. ఆంధ్రదేశమంతా అట్టుడికి పోయింది. 8 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. నెహ్రూ రాజాజీని చివాట్లు పెట్టి ప్రజలను శాంత పడమని శ్రీరాములు మరణం వృధాపోదని ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని పార్లమెంటులో ప్రకటించటంతో తెలుగుజాతి ఊరడిల్లింది. సాధుసుబ్రహ్మణ్యంగారే శవానికి దహనక్రియలు కర్మకాండ జరిపారు. గుడివాడలో పొట్టిశ్రీరాములు స్మృతికి హైస్కూల్ వెలిసింది. అదే ఎస్పీ.ఎస్ హైస్కూల్. గుడివాడ నిండా ఆయన విగ్రహాలు అనేక పాఠశాలల్లో వాసవీ సంఘాలు పెట్టారు. కానీ ఆయన నిజమైన త్యాగచరిత్రను  నేటి తరానికి అందించటంలో పూర్తిగా కృతకృత్యులు కావటానికి అంకితభావం కలిగిన దేశభక్తి, తెలుగుజాతిపట్ల పరిపూర్ణ ఆరాధ్యత నిండిన దూతలు అవసరం.


         జర్నలిస్టుగా నేను 1992లో గుడివాడలో బాధ్యతలు తీసుకున్నాను. మూడు వారాల్లో ఒ పెద్ద కుంభకోణాన్ని బయటపెట్టాను. ఆ సందర్భంలో నాకు ప్రాణహాని కూడా ఎదురైంది. తప్పించుకున్నాను. కుంభకోణం చేసిన వారు ఆ రోజుల్లో 5 లక్షలు నాకు లంచం ఎరచూపారు. నేను లొంగలేదని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. చివరికి పరువునష్టం దావా లక్షల్లో వేసారు. అన్నీ నా రిపోర్టు యాదార్ధమని రుజువు కావటంతో సదరు వ్యక్తులు తగిన శిక్ష అనుభవించారు. ఎందరికో అన్యాయం చేసిన వాళ్ళ పాపాలు నా చేతిలో పండాయి అన్నారంతా. మంచి జర్నలిస్టునని పేరువచ్చింది. ఆ పేరు విని ఒక వ్యక్తి చిన్న ఫోటో తెచ్చి నాకిచ్చి ఇదేమిటో పరిశోధించడం మీవల్లే అవుతందని నా ప్రగాఢ విశ్వాసం అన్నాడు. ఎద్దులబండి మీద శవం ఉన్న ఆ ఫోటో పట్టుకుని 6 నెలలు పాటు పరిశోధించగా అప్పటికి జీవించి ఉన్న స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో మహనీయులు నాకు దారి చూపించారు. ఊహించని వ్యక్తులను కలిసాను. ఇంటర్యూలు చేసాను. మంచంలో ఉన్నవారు కొందరు. కళ్ళు కనిపించని వృధ్ధులు కొందరు. అవసాన దశలో ఉన్నవారే దాదాపూ అందరూ. వావిలాల గోపాలకృష్ణయ్య ఒక్కరే ఆరోగ్యంగా తిరుగుతున్నారు. కానీ వారంతా గొలుసుకట్టుగా నాకు సమాచారాన్ని అందించారు. చరిత్ర పొట్టిశ్రీరాములు ఆఖరిరోజులపై కప్పిన నల్లటి దుప్పటిని నేను చించిపోగులు పెట్టాను. రాజకీయ దురుద్దేశాలతో కప్పెట్టిన సత్యాన్ని ధైర్యంగా వెలుగులోకి తెచ్చాను. అప్పటి మా ఎడిటర్ అమరనాధ్ గారు నాకు సంపూర్ణ స్వేచ్చ, సహకారం ఇచ్చారు. అదే సమయంలో గుడివాడలో పొట్టిశ్రీరాములు కాంస్యవిగ్రహాన్ని నా తెనాలి ఆఫ్తమిత్రుడు అక్కలశ్రీరామ్ చెక్కుతున్నాడు. దానితో ఈనాడు పత్రిక నన్ను చరిత్ర పరిశోధకుడిగా పరిచయం చేస్తూ బ్రహ్మారెడ్డిగారు పామర్రు నుంచి గుడివాడ ఇన్ చార్జిగా నా పరిశోధనను ఈనాడు మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో 1996 డిసెంబరు 16న ప్రకటించారు. అదే రోజు కాంస్యవిగ్రహ ఆవిష్కరణకు వచ్చిన కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర, రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ బహిరంగ సభలో నా రిపోర్టు చరిత్రను తిరగరాసిందని కితాబునిచ్చారు. అవన్నీ ఒక ఎత్తు నేటికీ శ్రీరాములుగారి త్యాగం నా గుండెల్లో తీరని వేదననే మిగల్చటం ఎవరికీ చెప్పుకోలేనిది.


ఇటీవల కూరాళ్ళ భుబంగభూషణరావు గారి అభ్బాయి భవ మా ఇంటికివచ్చి గాంధీ మండపం విశేషాలు చరిత్ర వల్లె వేసుకున్నాం. భుజంగ భూషణం గారు పొట్టి శ్రీరాములు గారికి మంచి మిత్రులు. నాతో చాలా విషయాలు ఆనాడు పంచుకున్నారు. స్వాతంత్ర్యసమరయోధులు, తామ్రపత్ర అవార్డు గ్రహీత. గుడివాడలో జాతీయజండా పండుగ దినాలైన ఆగస్టు 15, రిపబ్లిక్ దినోత్సవం రోజుల్లో పిల్లలందరికీ వారి విజయలక్ష్మీ ఫోటో స్టోర్స్ దగ్గర జండాలు పంచేవారు.. నిజమైన దేశభక్తులు


రచయిత..MSV సత్యనారాయణ బాబు(కపర్డి)

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top