ఆహార వృథాని అరికడదాం!(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం)
ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు,ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. దేశంలో హరిత విప్లవం వచ్చాక ఆహార ఉత్పత్తులు పెరిగాయి. ఆహార ఎగుమతులు పెరిగాయి. కానీపేదవారి ఆకలి దప్పులు అలాగే ఉన్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్16న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆకలి సూచిలో కూడా మన స్థానం ఆశాజనకంగా లేదు.
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను స్థాపించారు. దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు.నేటి మన చర్యలే రేపటి మన భవిష్యత్ ని నిర్ణయిస్తాయి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత దేశంలో 28 శాతం పేదరికం ఉందని,పేదరిక శాతం తగ్గినప్పటికీ, పేదల సంఖ్య గణనీయంగా ఉందని తెలిపింది. కరోనా ప్రపంచంతో పాటు,మనదేశాన్ని కూడా దారుణంగా దెబ్బతీసింది.ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మన దేశాన్ని చిన్నాభిన్నం చేసింది.
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేదవారికి తగిన పౌష్టికాహారం లభించడం లేదు.ఆహారపు గిడ్డంగుల్లో ధాన్యాన్ని ఎలుకలు కొట్టేస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు
సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా కాలంలో కేరళ ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులని పంపిణీ చేసింది.ఇక వివాహాలు తదితర వేడుకల్లో వృథా అయ్యే ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజురోజుకూ వ్యవసాయం చేసే వారి సంఖ్య మరింత తగ్గిపోతుంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పట్టణాలకు తరలిపోతున్నారు.ఫలితంగా దేశవ్యాప్తంగా వలస కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది.వీరి వివరాలు ప్రభుత్వాల వద్ద లేవు.కరోనా కాలం లో వీరి వెతలు ప్రత్యక్షంగా చూశాము.
ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. దళారుల ప్రమేయాన్ని నియంత్రణ చేయాలి.నాణ్యమైన విత్తనాలని రైతులకు అందించాలి.ఎరువుల ధరలు తగ్గించాలి.భూసార పరీక్షలని
ఉచితంగా చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేదవారికి ఏడాది పొడవునా పని కల్పించాలి.తద్వారా కొంతవరకయినా పేదరికం తగ్గుతుంది. పౌష్టికాహారం అందరికి అందుతుంది
యం.రాం ప్రదీప్
జనవిజ్ఞానవేదిక
తిరువూరు
9492712836
0 comments:
Post a Comment