రాజ్యాంగాన్ని రక్షిద్దాం!

 


"రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసే పాలకులు ఉత్తములు కాకపోతే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరవు"అంటారు డా.బీఆర్ అంబేద్కర్.స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో పాలకులు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో పాలన సాగించారు.అందుకే మొదటి పంచవర్ష ప్రణాళిక విజయవంతం అయింది. కొన్ని సాగునీరు ప్రాజెక్టులు, మరికొన్ని భారీ పరిశ్రమలు దేశంలో నెలకొల్పబడ్డాయి.రానురాను నాయకుల్లో అధికార వ్యామోహం పెరగడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడింది.ఎన్నికల్లో కుల,మత,ధన ప్రభావం పెరిగింది.సామాన్యుడు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఈనాడు లేకుండా పోయింది.

         1975-77 మధ్య దేశంలో ఎమర్జెన్సీ విధించిన ఘటన భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ.రాజ్యాంగం ప్రకారం ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు.ప్రజాభీష్టం మేరకు పాలకులు నడుచుకోవాలి.కానీ వాస్తవ పరిస్థితులు అలా లేవు.పాలకులు చట్టాల రూపకల్పనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించడంతో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సి వస్తుంది.మరోవైపు పౌర ఉద్యమాలు జరుగుతున్నాయి.

            ఎన్నికల్లో ఎదో ఒక విధంగా గెలుద్దాం అనే ధోరణి పెరుగుతుంది. ఇందుకు పాలకులు తమ ముందున్న అన్ని మార్గాలని వినియోగించుకుంటున్నారు.ప్రజల భావోద్వేగాలతో రాజకీయం చేస్తున్నారు.ఆర్ధిక అసమానతలు,వివక్షత లేని సమాజాన్ని అంబేద్కర్ ఆశించారు.అణగారిన వర్గాల వారి హక్కులు కాపాడటానికి ఆయన ఎనలేని కృషి చేశారు.

               రాజ్యాంగంలో హక్కులతో పాటు,విధులని కూడా చేర్చారు.మత ప్రమేయంలేని రాజ్యాంగం మనది. కానీ పాలకులు మాతాన్ని మాత్రమే తమ ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నారు.

               వ్యక్తిగత ఆరాధన పనికి రాదని,ఉన్నతవిద్య ద్వారా మాత్రమే నిమ్న వర్గాల వారు తమ హక్కులని కాపాడుకోగలరని అంబేద్కర్ అన్నారు.

              భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభచేత ఆమోదించబడి,1950  జనవరి 26నుండి అమలౌతుంది.నవంబర్ 26న రాజ్యాంగ ఆమోద దినోత్సవం దేశ వ్యాప్తంగా జరుపుకుంటాం.రాజ్యాంగ లక్ష్యాల గురించి చర్చించుకుంటాం.

              కానీ ఈనాడు చట్ట సభల్లో ప్రజాప్రతినిధులు సమస్యలు గురించి చర్చించకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ అమూల్యమైన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.కనీసం చర్చ లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారు.ఇటువంటి పరిణామాల వల్ల అంబేద్కర్ ఆశించిన సమ న్యాయం జరగదు.

            కరోనా కాలంలో న్యాయస్థానాలు చురుగ్గా పనిచేసాయి. పౌర సంఘాలు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసి పాలకుల యొక్క బాధ్యతలని గుర్తు చేశాయి.1977లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు వచ్చాయి.ప్రజలు కూడా అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించారు.అయితే విపక్షాల అనైక్యత వల్ల తిరిగి 1980లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓటమి చవిచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజాపయోగ నిర్ణయాలు తీసుకుంది.ప్రాంతీయ పార్టీలు అవతరించాయి.తద్వారా అనేక స్థానిక సమస్యలు పరిష్కరించబడ్డాయి.ప్రాంతీయ పార్టీల ప్రాభల్యం పెరగడంతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.అదే సమయంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలని నిర్వీర్యం చేసే పనిని ప్రారంభించాయి.రాష్ట్రాల ప్రయోజనాలని కాపాడుకోవడానికి ఉద్యమాలు జరిగాయి.రాష్ట్రాలలో గవర్నర్ పాత్ర నామమాత్రం అయిపోయింది.పార్టీ ఫిరాయింపులు పెరిగాయి.

         ప్రపంచ దేశాల్లో భారత దేశ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మార్చడానికి వీలులేదు. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం.మేధావులు, విద్యావంతులు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడంలేదు.యువతలో అధికశాతం భావోద్వేగాలకు గురౌతున్నారు.

        సామాజిక శాస్త్రాలు అభ్యసించేవారు తగ్గిపోతున్నారు.అంబేద్కర్ ఆశించిన ప్రభుత్వాలు ఏర్పడాలంటే యువత వ్యక్తిగత ఆరాధనని వీడాలి. శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలి.ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.ఉన్నత విద్యని అభ్యసించి, ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి. నీతి నిజాయితీ గల నాయకులని ఎన్నుకోవాలి. అప్పుడే రాజ్యాంగం రక్షించబడుతుంది.

యం.రాం ప్రదీప్

తిరువూరు

9492712836

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top