డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళన ఉదృతం: APNGO


డిమాండ్లు నెరవేర్చకుంటే ఆందోళన ఉదృతం: APNGO

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై మరింత ఉధృతంగా పోరాడేందుకు ఉద్యోగులు ఉద్యుక్తులవుతున్నారు.డిమాండ్ల సాధనలో ఐక్యంగా పోరాడాలని ఏపీ ఎన్జీవోలు, ఏపీ జేఏసీలు సంయుక్తంగా సూచించాయి. 71 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కారం చేసేంత వరకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని వారు పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్‌ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఎన్జీవోలు, ఏపీ ఉద్యోగ జేఏసీల ప్రాంతీయ సమావేశం జరిగింది. ఏపీ ఎన్‌జీఓల రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే శివారెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరై ఉద్యోగులను సమాయత్తపరిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఏపీ ఎన్జీఓలు, ఏపీ జేఏసీ సంయుక్తంగా తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని యోచిస్తున్నాయని, డిసెంబర్ 13న రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన పట్టణాలు, నగరాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం 16 న మండల స్థాయిలో ధర్నాలు, 21 న జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమం, 30న ప్రాంతీయ సమావేశం నిర్వహించేలా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకున్నట్లు చెప్పారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) అమలుతో పాటు 71 డిమాండ్లను పరిష్కరించుకునేందుకు రాష్ట్రంలోని ఉద్యోగులంతా దృఢ సంకల్పంతో ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ అమరేంద్రబాబు, నాయకులు రాఘవులు, ముత్యాలరెడ్డి, అశోక్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రఘు, తిరుపతి ఏపీ ఎన్‌జీఎల అధ్యక్షుడు సురేష్‌, కార్యదర్శి వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top