ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ బోధకులు(అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించే యోచన

* పాఠశాలలకు బోధకులు

*కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు

 జిల్లాలో పాఠశాలల్లో ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో అక్కడ బోధకులు(అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించే యోచన చేస్తున్నారు. ఏ క్షణాన అయినా ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రతిపాదనలు కోరే అవకాశం ఉందని తెలియటంతో ప్రస్తుతం ఆకసరత్తులో యంత్రాంగం తలమునకలై ఉంది. 

*రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది వరకు అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లు అవసరం ఉండొచ్చని ప్రాథమికంగా భావించినట్లు తెలిసింది*. అయితే అంతకు మించి అవసరమవుతారని 3,4,5 తరగతులు విలీనమైన హైస్కూళ్లకే నలుగురు ఉపాధ్యాయులను అదనంగా కేటాయించాలని ఇంతకుముందే ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతిపాదన పెట్టింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే ఏకోపాధ్యాయ పాఠశాలలు వందకు పైగా ఉన్నాయి. విలీన పాఠశాలలు మరో 204 ఉన్నాయి. ఇలా చూసినా జిల్లాకు కనీసం వెయ్యి మంది వరకు బోధకులు అవసరమవుతారని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. టీచర్ల సమస్యను అధిగమించటానికి ఇప్పటికిప్పుడు డీఎస్సీ ని యామకాలు చేయలేరు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ విద్యా సంవత్సరానికి బీఈడీ, డీఎడ్‌ పూర్తిచేసిన వారిని ఇన్‌స్ట్రక్టర్లుగా తీసుకుని వారితో తరగతులు బోధించాలనే యోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది.

ఛైల్డు ఇన్‌ఫో సమాచారం ప్రకారం

ఇన్‌స్ట్రక్టర్లు ఎంతమంది అవసరమో గుర్తించటానికి ఎక్కడకో వెళ్లాల్సిన పనిలేదు. జిల్లాలో  ఉన్న 3530 పాఠశాలల సమస్త సమాచారం జిల్లా విద్యాశాఖ ఉంది. ఛైల్డుఇన్‌ఫో సైట్లో ప్రతి పాఠశాలలో ఎంత మంది పిల్లలు చదువుతున్నారు, ఉపాధ్యాయులు ఎంతమంది పనిచేస్తున్నారు వంటి సమాచారం మొత్తం ఉంది. దీన్ని ప్రామాణికంగా తీసుకుని పనిభారం అంచనా వేస్తున్నామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. డీఈఓ కార్యాలయంలోని ఐటీ విభాగం ఉద్యోగులు, కొందరు డీవైఈఓలు కూర్చొని గత మూడు రోజుల నుంచి దీనిపై కసరత్తు చేస్తున్నారు. 3,4,5 ప్రాథమిక, 6,7,8 ఉన్నత తరగతులకు ఒకే పాఠశాలలో తెలుగు, ఇంగ్లీష్‌ మీడియాలు వేర్వేరుగా అభ్యసించే వారు ఉన్నా అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఇవ్వటానికి ఆ రెండు మీడియాలను ఒకే మీడియంగా భావించి పిల్లల సంఖ్య ఆధారంగా ఇన్‌స్ట్రక్టర్లను కేటాయించటానికి కసరత్తు చేస్తున్నారు.  

మరోవైపు మ్యాపింగ్‌

ఒకవైపు ఇన్‌స్ట్రక్టర్ల  నియామకానికి కసరత్తు మరోవైపు ప్రతి మండలంలో ఉన్నత పాఠశాలకు రెండు కిలోమీటర్ల పరిధిలో ఏయే పాఠశాలలు ఉన్నాయో వాటిని మ్యాపింగ్‌ చేయాలని ప్రధానోపాద్యాయులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఇంతకు ముందు ఉన్నత పాఠశాల కాంపౌండ్‌లో ఉన్న అన్ని ప్రాథమిక స్కూళ్లను అందులో విలీన చేశారు. ప్రస్తుతం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని రకాల ప్రాథమిక పాఠశాలలను గుర్తించే కసరత్తును ప్రదానోపాధ్యాయులు చేస్తున్నారు. మ్యాపింగ్‌లో భాగంగా ప్రతి పాఠశాలలో ఎంతమంది పిల్లలు, తరగతి గదుల సంఖ్య, మరుగుదొడ్లు ఎన్ని ఉన్నాయి, ప్రధానోపాద్యాయుడికి ప్రత్యేక గది ఉందా లేదా వంటి వివరాలతో సహా మ్యాపింగ్‌లో పొందుపరచాలని హెచ్‌ఎంలకు సూచించారు. ప్రస్తుతం ఒక ఉన్నత పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఎన్ని ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో గుర్తించి మ్యాపింగ్‌ చేయాలని సూచించటంతో భవిష్యత్‌లో వీటిని కూడా ఉన్నత పాఠశాలల్లో కలిపేస్తారేమోనన్న ఉత్కంఠ ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో నెలకొంది. దీనిపై జిల్లా విద్యాశాఖవర్గాలు మాట్లాడుతూ అకడమిక్‌ ఇన్‌స్రక్టర్ల నియామకానికి, ప్రాథమిక పాఠశాలల విలీనానికి కసరత్తు జరుగుతున్న మాట వాస్తవమేనని ధ్రువీకరించారు.

Posted in: , ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top