హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షర్లకు అదనపు బెనిఫిట్ల అంశాన్ని సజ్జల, సీఎంఓ అధికారి దనుంజయరెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాస్, బొప్పరాజు తెలిపారు.హెచ్‌ఆర్‌ఏ అంశంపై ఉత్తర్వులు ఇవ్వొద్దన్న డిమాండ్‌పై సీఎంవో అధికారులు గురువారం మధ్యాహ్నం వరకు సమయం కోరారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాస్, బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలుగా తమపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సమ్మెబాట పట్టాయని గుర్తు చేశారు. హెచ్‌ఆర్‌ఏ జీవో ఇవ్వొద్దంటూ సీఎంవో క్యాంప్ కార్యాలయం దగ్గర పడిగాపులు కాశామని, రెండు దఫాల చర్చలు జరిగినా ఎటూ తేల్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
''గురువారం మధ్యాహ్నం వరకూ సీఎంవో అధికారులు సమయం కోరారు. ఈలోగా పరిష్కారం దొరకకపోతే ఉద్యమం తప్పదు. ఊహించిన బెనిఫిట్స్ కంటే అడగని అంశాలపై కూడా సీఎం హామీ ఇచ్చారు. అందుకే ఆ రోజు ఆనందం వ్యక్తం చేశాం. హెచ్‌ఆర్‌ఏపై అధికారులతో మాట్లాడిన తర్వాత అసలు వాస్తవం తెలిసింది. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి ఈ హెచ్‌ఆర్‌ఏ అమలైతే తీవ్రంగా నష్టపోతాడు. సచివాలయం, హెచ్‌ఓడీల్లోని ఉద్యోగులు హెచ్‌ఆర్‌ఏ విషయంలో తీవ్రంగా నష్టపోతారు. వేల రూపాయల జీతం కోత పడుతుంది. గత ప్రభుత్వ హయాంలో జిల్లా హెడ్ క్వార్టర్ల వారీగా సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లను సైతం ఇప్పుడు మార్చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గురువారం మధ్యాహ్నంలోగా హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, రిటైర్మెంట్ ఉద్యోగులకు లభిస్తున్న అదనపు మొత్తంపై స్పష్టత ఇవ్వకపోతే ఉద్యమానికి వెళ్తాం.'' బండి శ్రీనివాస్, బొప్పరాజు హెచ్చరించారు.
0 comments:
Post a Comment