తక్షణమే పీఆర్సీ జీవోలను పునః సమీక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘అధికారులేం చెప్పినా...ఆర్థిక పరిస్థితి ఎలాఉన్నా...పీఆర్సీ జీవోలపై సమీక్ష జరగాల్సిందే. ప్రభుత్వం గతంలో చేసిన ప్రకటన కంటే భిన్నంగా జీవో ఉంది. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి ప్రక్రియ గురించి ఇంతవరకు మేం వినలేదు. రాజకీయ కోణంలో చూసినా.. ఇది సరైన నిర్ణయం కాదు’’ అని సూర్యనారాయణ కోరారు.
జీవోలన్నీ వెనక్కి తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డిపీఆర్సీపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలన్నీ వెనక్కి తీసుకోవాలని ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిమాం డ్ చేశారు. ‘‘మేం అధికారుల కమిటీ నివేదికను ప్రతి సమావేశంలోనూ వ్యతిరేకించాం. ఈ కమిటీ హెచ్‌ఆర్‌ఏ స్లాబులను దారుణంగా తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన హెచ్‌ఆర్‌ఏ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో ప్రతిఫలించలేదు. 11వ పీఆర్సీ నివేదికను ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చి మళ్లీ చర్చలకు పిలవాలి. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పరస్పర అంగీకారంతో జీవోలు రావాలిగానీ ఏక పక్షంగా విడుదల చేయడం దారుణం. అంతా కలిసి ఒక్క మాటపై నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దాం’’అని వెంకట్రామిరెడ్డి కోరారు. అనంతరం సీఎంవో అధికారులను కలిసి, ఉద్యోగ సంఘాలను మరోసారి చర్చలకు పిలవాలని కోరినట్టు తెలిసింది.
0 comments:
Post a Comment