కొత్త జిల్లాలకు జూనియర్లు ఉద్యోగుల సర్దుబాటులో ‘రివర్స్‌’ సీనియారిటీ

కొత్త జిల్లాల ఏర్పాటులో ముఖ్యమైన ఉద్యోగుల విభజన ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. వీటి ఏర్పాటుపై అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు ముగిసినందున అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఆర్థిక శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా, డివిజన్‌ స్థాయి ఉద్యోగుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కొత్త జిల్లాలకు తగ్గట్టు ప్రస్తుతమున్న రాష్ట్ర, జోనల్‌, జిల్లా వ్యవస్థల్లో మార్పు చేసేందుకు రాష్ట్రపతి స్థాయిలో ఆమోదం లభించాల్సి ఉంది. దీనికి సమయం పడుతుంది. ఈలోగా తాత్కాలికంగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నారు. శాఖలవారీగా సిబ్బంది సంఖ్యను ప్రకటిస్తూ ఎందరు ఉద్యోగులను ఏయే జిల్లాలకు పంపించాలనేది వచ్చేవారం ఖరారయ్యే అవకాశముంది. ప్రస్తుతమున్న జిల్లా కార్యాలయంలో ఒక హోదాకు సంబంధించి ఎవరు జూనియర్‌ అయితే వారిని కొత్త జిల్లాకు కేటాయిస్తారు. దీనిని ‘రివర్స్‌ సీనియారిటీ’గా పేర్కొంటున్నారు. పదోన్నతులకు భిన్నంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కొత్తగా పోస్టుల భర్తీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా, డివిజన్‌ కార్యాలయాల్లో పనిచేసేవారిని మాత్రమే ఆర్డర్‌ టు సర్వ్‌ ఆధారంగా తాత్కాలికంగా జిల్లాలకు కేటాయించనున్నారు. మండల, గ్రామస్థాయి ఉద్యోగుల విషయంలో మార్పులుండవు. ఉద్యోగుల విభజనకు సంబంధించి వ్యవసాయ శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖలు రూపొందించిన నమూనాకు అనుగుణంగా జిల్లాల్లో ఉద్యోగుల విభజన కసరత్తు చేస్తున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top