ఆర్థికంగా వెనుకబడిన నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన(పీఎం-జేఏవై)’ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అర్హులైన లబ్దిదారులు అనారోగ్యం బారిన పడినప్పుడు.. ఒక్క పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా దేశంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయినా ఉచితంగా నాణ్యమైన ఆరోగ్యసేవలు పొందవచ్చు. ఇప్పటివరకు ఈ పథకం కింద పది కోట్లకు పైగా ఈ-కార్డులు జారీ అయ్యాయి. మీరూ ఈ పథకానికి అర్హులయితే.. వెంటనే హెల్త్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి..
ఎవరెవరు అర్హులు..
16 నుంచి 59 ఏళ్ల వయసున్న మగదిక్కు లేని కుటుంబాలు, వికలాంగులు ఉన్న కుటుంబాలు, ఏ పనీ చేయలేని వృద్ధులున్న కుటుంబాలు, ఇల్లు లేని వారు, రోజు వారి కూలీ పనులకు వెళ్లేవారు,సరైన ఇల్లు లేనివారు, ఒక్క గదిలో జీవిస్తున్న కుటుంబాలు, బట్టలు ఉతికేవాళ్లు/చౌకీదార్లు, బట్టలు ఏరుకునేవారు, మెకానిక్‌లు, ఎలక్ట్రీషియన్లు, రిపెయిర్ వర్కర్లు, ఇళ్లలో పనిచేసేవారు, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, వీధులు ఊడ్చేవాళ్లు, చేతి వృత్తులు చేసుకునేవాళ్లు, హస్తకళల కార్మికులు, కుట్టుపనివాళ్లు, చెప్పులు కుట్టేవాళ్లు, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, ప్లంబర్లు, మేస్త్రీలు, భవన నిర్మాణ కూలీలు, పోర్టర్లు, వెల్డర్లు, పెయింటర్లు, సెక్యూరిటీ గార్డులు, క్యాబ్ వాహనాలు నడిపే డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్లు, రిక్షా తొక్కేవారు, డెలివరీ బాయ్స్, షాప్ కీపర్లు, వెయిటర్లు, పారిశుద్ధ్య పనుల్లో ఉన్న కుటుంబాలు, బిచ్చగాళ్లు మొదలైనవారు ఈ పథకానికి అర్హులు.
ఈ పథకానికి మీరు అర్హులో.. కాదో.. తెలుసుకోండిలా..
ముందుగా పీఎంజేఏవై పథకం అధికారిక వెబ్‌సైట్ https://pmjay.gov.in/ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ‘యామ్ ఐ ఎలిజిబిల్(Am I Eligible)’ క్లిక్ చేయాలి.
అందులో మీ మొబైల్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి.. ‘జనరేట్ ఓటీపీ(Generate OTP)’ క్లిక్ చేయాలి.
ఇప్పుడు లబ్దిదారుడు తన రాష్ట్రం, జిల్లాను సెలెక్ట్ చేసుకొని.. పేరు/హెచ్‌హెచ్‌డీ నంబరు/రేషన్ కార్డు నంబరు/మొబైల్ నంబరును సెర్చ్ చేయాలి.
సెర్చ్‌లో వచ్చిన ఫలితాల ప్రాతిపదికగా పీఎంజేఏవై కింద మీ కుటుంబానికి అర్హత ఉందో లేదో తెలుస్తుంది.
ఆయుష్మాన్ భారత్ యోజన కాల్ సెంటర్ నంబరు 14555 లేదా 1800-111-565కి ఫోన్ చేసి మీరు ఈ పథకానికి అర్హులో.. కాదో.. తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ పథకానికి అర్హులయితే.. ఈ కింది డాకుమెంట్స్ వివరాలు అందించి రిజిస్టర్ చేసుకోవచ్చు.
పీఎంజేఏవై పథకానికి కావలసిన ధృవపత్రాలు:
గుర్తింపుకార్డు
వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు
మొబైల్ నంబర్
ఈ-మెయిల్ అడ్రస్
ఇంటి అడ్రస్
కుల ధ్రువీకరణ పత్రం
ఆదాయ ధృవపత్రం((ఏడాదికి రూ.5 లక్షల వరకే)
ఈ పథకం కింద మీ ఫ్యామిలీ కవర్ అయ్యేందుకు అవసరమయ్యే డాక్యుమెంట్ ప్రూఫ్(కుటుంబ స్థితిగతులను తెలిపే ధృవపత్రం)
ఈ పథకం కింద అందించే ఖర్చులు
ఆయుష్మాన్ భారత్ పథకం కవరేజ్ కింద రోగిని మూడురోజుల ముందు ఆస్పత్రిలో చేర్చడంతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా కేంద్రమే భరిస్తుంది. వైద్యపరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్, ప్రీ-హాస్పిటలైజేషన్, నాన్-ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, మందులు, ఇతరత్రా ఖర్చులు అందిస్తారు. డయాగ్నస్టిక్స్, లేబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు ఇందులోకి వస్తాయి. కోవిడ్-19 చికిత్సను కూడా ఈ పథకం కింద అందిస్తారు.
ఈ పథకానికి అర్హులైనవారు మీ హెల్త్ కార్డు(ఈ-కార్డు)ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
0 comments:
Post a Comment