NFSU Notification 2024 ఫోరినిక్స్ సైన్స్ కోర్సులు చేసిన వారికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు

ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు పూర్తి చేసుకుంటే.. నేరాల గుట్టు విప్పే నైపుణ్యం సొంతమవుతుంది. దీంతో విస్తృత కెరీర్‌ అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సులను నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ అందిస్తోంది.

నేషనల్‌ ఫోరెన్సిక్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తోంది. ఇటీవల 2024 సంవత్సరానికి సంబంధించి ఎన్‌ఎఫ్‌ఏటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎన్‌ఎఫ్‌ఏటీ 2024 వివరాలు, అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియ, కెరీర్‌ స్కోప్‌ తదితర వివరాలు..


ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ

ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి అవసరమైన నిపుణులను తీర్చిదిద్దే ఉద్దేశంతో.. కేంద్ర హోంశాఖ పరిధిలో ప్రత్యేకంగా నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీని నెలకొల్పారు. ఫోరెన్సిక్‌ సైన్స్, డిజిటల్‌ ఫోరెన్సిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, క్రిమినాలజీ, సైకాలజీ, బిహేవియరల్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో స్కిల్స్‌ను అందించేలా పలు కోర్సులు అందుబాటులోకి తెచ్చారు.

9 క్యాంపస్‌లు.. 2,462 సీట్లు

మూడేళ్ల క్రితం ఏర్పాటైన నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీకి తొమ్మిది (గుజరాత్, ఢిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్, పుణె, గువహటి, మణిపూర్, ధర్వాడ్‌) క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిద్వారా పీహెచ్‌డీ, పీజీ, బీటెక్, బీఎస్సీ, బీఏ, ఎంబీఏ, లా, క్రిమినాలజీ, సైకాలజీ తదితర వినూత్న కోర్సులు అందిస్తున్నారు. పీహెచ్‌డీ మొదలు పీజీ డిప్లొమా వరకూ.. పలు కోర్సుల్లో 2,462 సీట్లు ఉన్నాయి.

కోర్సులు

బీటెక్,ఎంటెక్, ఎమ్మెస్సీ,ఎంఏ,బీబీఏ-ఎంబీఏ, ఎంబీఏ,ఎల్‌ఎల్‌బీ,ఎల్‌ఎల్‌ఎం,ఎం.ఫార్మసీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో నేషనల్‌ ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రవేశాలు కల్పిస్తోంది.

అర్హతలు: ఆయా కోర్సులను అనుసరించి ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎన్‌ఎఫ్‌ఏటీ ప్రవేశం

ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ అడ్మిషన్‌ టెస్ట్‌లో స్కోర్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ ఎంట్రన్స్‌ టెస్ట్‌ను ఆయా కోర్సులను అనుసరించి సంబంధిత సబ్జెక్ట్‌లలో వంద ప్రశ్నలు-వంద మార్కులకు నిర్వహిస్తారు. పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ఈ పరీక్షకు లభించే వ్యవధి గంటన్నర. పీజీ డిప్లొమా కోర్సులకు నిర్దేశిత విద్యార్హతల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఈ కోర్సుల అభ్యర్థులు ఎన్‌ఎఫ్‌ఏటీకి హాజరవ్వాల్సిన అవసరం లేదు. ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులకు ఎంట్రన్స్‌ టెస్ట్‌తోపాటు ఇంటర్వ్యూ కూడా నిర్వహిస్తారు.

యూనివర్సిటీల స్థాయి

ఆయా రాష్ట్రాల్లో యూనివర్సిటీల అనుబంధ కళాశాలల్లోనూ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ను పలు ఇన్‌స్టిట్యూట్స్‌లు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి తెలంగాణలో టీఎస్‌సీపీగెట్, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీపీజీఈసెట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నల్సార్‌ హైదరాబాద్‌లో ఎంఏలో క్రిమినల్‌ లా అండ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌ అందుబాటులో ఉంది.

సర్కారీ ఉద్యోగాలు!

ప్రస్తుతం ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ అందిస్తున్న కోర్సులను పూర్తి చేసుకున్న వారు కార్పొరేట్‌ రంగంలో, ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీలలో కొలువులు సొంతం చేసుకునే అవకాశముంది.

ప్రభుత్వ రంగంలో సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలు, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలు, ప్రాంతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్స్, సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్, పోలీస్‌ డిపార్ట్‌మెంట్, సీబీఐ, ఐబీ వంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు దక్కించుకునే వీలుంది.

ప్రైవేట్‌ రంగంలో ఫార్మాస్యుటికల్‌ సంస్థలు, ఆస్పత్రులు, ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటితోపాటు విద్యా రంగంలోనూ అధ్యాపకులుగా కెరీర్‌ ప్రారంభించొచ్చు.

జాబ్‌ ప్రొఫైల్స్‌ ఇవే

క్రైమ్‌ సీన్‌ ఇన్వెస్టిగేటర్‌: ఏదైనా నేరం జరిగినప్పుడు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగం ఇది. దీనిలో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాల సేకరణ, నేరం జరిగిన తీరును అంచనా వేయడం, ఆధారాలను ల్యాబరేటొరీల్లో శాస్త్రీయంగా విశ్లేషించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌: నేరస్తులు లేదా నిందితుల మానసిక పరిస్థితిని విశ్లేషించడం, వాటి ఆధారంగా విచారణ విషయంలో వారికున్న మానసిక సన్నద్ధతకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. దీని ఆధారంగా సదరు విచారణ చేపట్టే విషయంలో నిర్దిష్ట చర్యలు తీసుకుంటారు.

ఫోరెన్సిక్‌ టాక్సికాలజిస్ట్‌: హత్యలు జరిగినప్పుడు ముఖ్యంగా ఎలాంటి భౌతిక దాడుల ఉనికి లేని సందర్భాల్లో హతులు ఏదైనా విష ప్రయోగంతో చనిపోయారా? లేదంటే ఇతర డ్రగ్స్‌ వినియోగం కారణంగా మరణించారా? వంటి విషయాలను పరిశీలిస్తారు.

ఫోరెన్సిక్‌ స్పీచ్‌ ఎక్స్‌పర్ట్స్‌: ఏదైనా నేరం జరిగినప్పుడు.. సదరు ఘటనా స్థలంలో లభించిన పత్రాలు, కెమెరా ఫుటేజ్‌లు, ఆడియో టేప్‌లను పరిశీలించడం, వాటి ఆధారంగా రాసిన వారిని, మాట్లాడిన వారిని గుర్తించడం వంటి విధులు నిర్ధారిస్తారు. దీని ద్వారా అసలు, నకిలీలను గుర్తించి వాటికి సంబంధించి నివేదికలు రూపొందించడం ప్రధాన విధులుగా ఉంటాయి.

పాథాలజిస్ట్‌: అనుమానాస్పద మృతుల విషయంలో పోస్ట్‌మార్టం ఆధారంగా సహజ మరణమా? లేదా హత్యకు గురయ్యారా లేదా ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనా? అనే విషయాలను పాథాలజిస్టులు గుర్తిస్తారు.

ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌: ఇటీవల కాలంలో ఆర్థిక నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో కీలకంగా నిలుస్తున్న మరో హోదా.. ఫోరెన్సిక్‌ ఆడిటింగ్‌. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన సంస్థలకు సంబంధించిన పత్రాలను విశ్లేషించడం, అవకవతకలు జరిగిన విభాగాలను లేదా వ్యక్తులను గుర్తించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

వేతనాలు

ఫోరెన్సిక్‌ విభాగంలో కొలువులు సొంతం చేసుకున్న వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో ఈ రంగంలో అడుగు పెట్టిన వారికి నెలకు రూ.50 వేల వరకు వేతనం లభిస్తోంది. పీజీ, పీహెచ్‌డీ పట్టాలతో ఫోరెన్సిక్‌ లేబొరేటరీల్లో పని చేసే వారికి రూ.లక్ష వరకు వేతనాన్ని అందిస్తున్నారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top