ఏపీకి మూడు రాజధానులు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ

ఏపీకి మూడు రాజధానులు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ

ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తే పరిస్థితి ఎలా ఉండనుందనే విషయమై ప్రొఫెసర్ నాగేశ్వర్ తనదైన శైలిలో విశ్లేషించారు. దక్షిణాఫ్రికా అధ్యక్ష పాలనలో ఉందన్న ఆయన.. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉండటం వెనుక ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. సౌతాఫ్రికా ఏర్పడక ముందు.. రెండు బలమైన ప్రావిన్సులకు రాజధానులుగా ప్రిటోరియా, కేప్‌టౌన్ ఉండేవన్నారు. ఈ రెండింటితోపాటు దేశానికి మధ్య భాగంలో ఉన్న బ్లోమె‌ఫోంటేన్‌ను మరో రాజధానిగా ఏర్పాటు చేశారన్నారు.

ఆ రెండూ వేర్వేరు..

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయిస్తే.. దాన్ని ప్రజలు స్వాగతించడం వేరు.. పాలనా వ్యవస్థ వేరని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. నగరానికి ఓ శాఖ చొప్పున ఏర్పాటు చేసినా.. ప్రజలు స్వాగతిస్తారు.. కానీ ఆ పని చేయలేమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వేరు.. పరిపాలన వికేంద్రీకరణ వేరని స్పష్టం చేశారు.

60 రోజులు అంతా రావాల్సిందే..

ఏడాదిలో 60 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ రెండు నెలలు సెక్రటేరియట్ మొత్తం అమరావతిలో ఉండాల్సిందే కదా అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలుకొని కింది స్థాయి అధికారి వరకు అందరూ వైజాగ్ నుంచి అమరావతికి రావాల్సి వస్తుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రంపై ఇది మరింత భారం మోపుతుందని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందన్నారు.

వైజాగ్-కర్నూలు ఆర్థికంగా భారం

హైకోర్టులో ప్రభుత్వానికి సంబంధించి చాలా కేసులు ఉంటాయి. కోర్టులో ఎంత మంది సచివాలయ అధికారులు ఉంటారో చూడండి. కేసులు వాయిదా పడినప్పుడల్లా.. ఉద్యోగులు ఫైళ్లను మోసుకొని వైజాగ్ నుంచి కర్నూలుకు వెళ్లాలి. ఇది ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందదు. పరిశ్రమలు వస్తేనే డెవలప్ అవుతుందని నాగేశ్వర్ తెలిపారు.

ముంబై, న్యూయార్క్ సంగతేంటి..?

‘‘న్యూయార్క్‌లో అమెరికా పార్లమెంట్ ఉండదు, అధ్యక్షుడు అక్కడ ఉండడు, సుప్రీం కోర్టు అక్కడ ఉందు. కానీ రాజధాని వాషింగ్టన్ కంటే న్యూయార్క్ ఎంతగానో అభివృద్ధి చెందింది. మాంచెస్టర్‌, ముంబై నగరాలు కూడా ఇలాగే డెవలప్ అయ్యాయి. దేశంలో వసూలయ్యే ఆదాయపన్నులో 40 శాతం ముంబై నుంచే వస్తోంద’’ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.

ప్రాంతాల మధ్య విభజన ఉంది..

‘‘ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అనే విభజన రాష్ట్ర ప్రజల్లో ఉన్న మాట వాస్తవమే. ఈ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారనిపిస్తోంది. చంద్రబాబు మోడల్ డెవలప్‌మెంట్ కూడా సరైంది కాదు. అది ఊహాజనీతం. నగరాన్ని నిర్మించడం వేరు.. ఆర్థిక వ్యవస్థ నిర్మించడం వేరు. ఎకానమీ వేరు, రాజధాని వేరు. హైదరాబాద్ ఎకానమీని అమరావతికి ట్రాన్స్‌ప్లాంట్ చేయలేం. హైదరాబాద్ ఆర్థికవ్యవస్థకు 400 ఏళ్ల చరిత్ర ఉంద’’ని నాగేశ్వర్ చెప్పారు.

బాబు తప్పు చేస్తే శిక్షించాల్సింది ప్రజలను కాదు..

‘‘చంద్రబాబు చర్యకు ప్రతిచర్యగా.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఆకాంక్షల కోసం జగన్ ఇలా చేయడం సరికాదు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనిపిస్తోంది. ఆరు నెలల వ్యవధిలో 4000 ఎకరాలకుపైగా చంద్రబాబు ఆయన బినామీలు కొన్నారంటున్నారు. అది నిజమని తేలితే శిక్షించాల్సింది చంద్రబాబును.. భూములు కొన్నవారిని కానీ.. ప్రజలను కాద’’ని ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. నది ఒడ్డున జరీ భూముల్లోని 29 గ్రామాల్లోనే ఈ పరిస్థితి ఉంది. కానీ తుళ్లూరు వైపు వెళ్తే.. ఈ పరిస్థితి ఉండదని ఆయన చెప్పారు.

పరిమిత స్థాయిలో రాజధాని

‘‘ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఏపీకి రాజకీయ అవసరాలను తీర్చేందుకు పరిమిత స్థాయిలో రాజధానిని నిర్మించాలి. ఆర్థిక వికేంద్రీకరణ కోసం నాలుగైదు నగరాలను నిర్మించాలి. ఇప్పటికే విశాఖ, రాజమండ్రి, తిరుపతి లాంటి నగరాలు డెవలప్ అయ్యాయి. స్థానిక పరిస్థితులు, అవకాశాలు, అనుకూలతలను బట్టి ప్రాంతాల వారీగా హార్టిక్చర్ హబ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్ తదితరాలను ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణకు లేని అడ్వాంటేజ్ ఆంధ్రకు ఉంది..

‘‘ఏపీకి 974 కి.మీ. పొడవైన సుదీర్ఘమైన తీర ప్రాంతం, నౌకాశ్రయాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను వికేంద్రీకరించి 6-7 బలమైన నగరాలను నిర్మించొచ్చు. తెలంగాణకు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే విమానయాన సౌకర్యం ఉంది. ఏపీలో చాలా నగరాలకు విమానయాన సౌకర్యం ఉంది. తెలంగాణకు లేని రీతిలో ఏపీకి నగరాలను డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత గుర్తొచ్చేది వరంగల్, కరీంనగర్ నగరాలు మాత్రమే. కానీ ఏపీలో ఇప్పటికే చాలా నగరాలు డెవలప్ అయ్యాయి. ఏపీలో పది నగరాలను గుర్తించి మరింతగా డెవలప్ చేయొచ్చ’’ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలిపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top