బలౌతున్న బాల్యం

       

రచయిత: శ్రీ రాం ప్రదీప్ గారు


 కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడ లాడిస్తుంది.ఈ మహమ్మారి ప్రత్యక్షంగా పిల్లలపై అంతగా ప్రభావం చూపనప్పటికీ,పరోక్షంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.2019 డిసెంబర్ చివర్లో చైనాలో కరోనా తొలి కేసు వెలుగు చూసిన దగ్గరనుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో పాఠశాలలు మూసివేసే ఉన్నాయి.ధనిక,ఎగువ మధ్యతరగతి కుటుంబాలకి చెందిన పిల్లలకి ఆన్ లైన్ తరగతులతో కొంతవరకు విద్యాబోధన జరుగుతుంది. దిగువ మరియు పేద విద్యార్థులు కరోనాతో బోధనా సౌకర్యాలు సక్రమంగా లభించడం లేదు.ఫలితంగా వీరిలో చాలామంది చదువుకు దూరమై,వివిధ రకాల పనులకు  వెళుతున్నారు.ఆడపిల్లలకి బాల్యంలోనే వివాహాలు జరుగుతున్నాయి.పిల్లల్లో కూడా మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.

ప్రతి సంవత్సరం జూన్ 12 న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాం.ఇప్పటికీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాల కార్మిక వ్యవస్థ ఒకటి. 21వ శతాబ్దంలోనూ ఈ సమస్య ఇంకా అంతం కావడం లేదు. ఎందరో బాలల భవిష్యత్‌ను చిదిమేస్తున్న కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి చేస్తూనే ఉంది. అయినప్పటికీ పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించడం లేదు

      కార్మికులుగా పనిచేసే 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని బాలకార్మికులుగా పరిగణిస్తారు. కొన్నిదేశాల్లో 17 ఏళ్లలోపు బాలల్ని కూడా కార్మికులుగానే భావిస్తారు. గత ఏడాది వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21 కోట్ల మంది బాల కార్మికులుగా కొనసాగుతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా.ఇప్పుడు ఈ సంఖ్య మరింత పెరిగింది. పిల్లలు ఎవరైనా బాలకార్మికులుగా ఉన్నారంటే వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లే. పరిశ్రమలు, వ్యవసాయం, తయారీ, మైనింగ్, నిర్మాణ రంగం, సేవలు సహా అనేక రంగాల్లో బాలలు కార్మికులుగా పనిచేస్తున్నారు.మరికొంతమంది భిక్షాటన చేస్తున్నారు.

 పిల్లల తల్లిదండ్రుల పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యతల కారణంగానే బాలకార్మికులు పెరిగిపోతున్నారు. కనీస అవసరాలకు సరిపడా ఆదాయం దొరకని అనేక కుటుంబాలు తమ పిల్లల్ని పనుల్లో చేర్పిస్తున్నాయి. ప్రపంచంలో పావుశాతం జనాభా కఠిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా, అసియా, లాటిన్‌ అమెరికాల్లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సి వస్తోంది. కొన్ని దేశాల్లో పిల్లలు విద్యనభ్యసించేందుకు అనువైన వసతులు లేకపోవడం కూడా ఒక కారణం. ప్రభుత్వాలు ఉచిత విద్య అందించకపోవడం, ప్రైవేటు విద్య ఖరీదు కావడంతో బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పని చేస్తున్నారు. వెట్టిచాకిరి, సామాజిక అంశాలు సైతం ఇందుకు కారణమవుతున్నాయి. ఇక కొందరు పిల్లలు వంశపారంపర్యంగా వస్తున్న పనుల్లోనే కొనసాగుతున్నారు.బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చట్టాలు రూపొందించింది. 1986 జువనైల్ జస్టిస్ చట్టం (జేజే యాక్ట్) ప్రకారం బాలకార్మికులతో పనిచేయించే వారిని తక్షణం అరెస్ట్ చేయవచ్చు. నేరం రుజువైతే ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధించే అవకాశం ఉంది. అన్ని పోలీస్‌స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసేందుకు బాలల హక్కుల పరిరక్షణ కేంద్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఎవరైనా పిల్లలతో పనిచేయిస్తున్నట్టు కనిపిస్తే నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ఇప్పుడు కరోనాతో తల్లి తండ్రులని కోల్పోయిన పిల్లలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది లక్షల వరకు సహాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.కరోనాతోనే గాకుండా ఇతర కారణాల వల్ల ఎవరైనా పిల్లలు తమ తల్లిదండ్రులని కోల్పోతే అటువంటి వారికి కూడా ఏదో ఒక రూపంలో సహాయం చేయాలి. పిల్లలకి కూడా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలి. దత్తత విషయంలో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులని పాటించేలా చూడాలి.తద్వారా భావి తరాలను కాపాడిన వారమౌతాము.

యమ్.రామ్ ప్రదీప్

తిరువూరు,9492712836

జూన్ 12 -ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం

విద్యా ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/JCVuygcrA4l2V3FrkfdTBQ

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Telugu & English News Papers More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top