ఆ సిఫారసులను అంగీకరించం
అశుతోష్ మిశ్రా నివేదికనే
అమలు చేసి తీరాలి
సజ్జలతో చర్చల్లో ఇదే చెప్పాం
బండి, బొప్పరాజు ప్రకటన
సోమవారం సీఎం నిర్ణయం
పీఆర్సీపై అశుతో్‌షమిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు కోరారు.
సీఎస్ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సిఫారసులు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశామన్నారు. శుక్రవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో జేఏసీల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు భేటీ అయ్యారు. భేటీ వివరాలను వారు మీడియాకు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫారసులనే అమలు చేస్తామని చెప్పగా... నిరాకరించినట్లు నేతలు తెలిపారు. ''14.29శాతం ఫిట్‌మెంట్‌ను వ్యతిరేకిస్తున్నాం. అశుతో్‌షమిశ్రా కమిటీ నివేదికను అమలు చేయాలని కోరాం. సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సజ్జల చెప్పారు'' అని చెప్పారు. సజ్జల ఆహ్వానం మేరకే శుక్రవారం చర్చలకు వచ్చినట్లు బండి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం పీఆర్సీపై సీఎం చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారన్నారు. మిగిలిన 70 డిమాండ్లపై బుధవారం చర్చిస్తామని తెలిపారన్నారు. కాగా, తాము ఉద్యమాన్ని పూర్తిగా విరమించలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం హామీలను నెరవేర్చుతామని లిఖితపూర్వక హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వానికి అవకాశం ఇచ్చేందుకే ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామన్నారు. ''ఇకపై ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎంవో అధికారికి బాధ్యత అప్పగిస్తామని సజ్జల చెప్పారు. సోమ, మంగళవారాల్లో పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సీఎం సోమవారం ఉదయం తొలుత అధికారులతో, తర్వాత అవసరమైతే ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరుపుతారని సజ్జల తెలిపారు'' అని వివరించారు.
మా మనోభావాలు దెబ్బతీశారు
ఉమ్మడిగా చేస్తున్న ఉద్యమాన్ని మధ్యలో విరమించడంపై ఏపీసీసీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. 2లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి వ్యవహరించాయని సంఘం అధ్యక్షుడు ఆర్.అప్పలరాజు మండిపడ్డారు. ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వకుండానే ఉద్యమానికి విరామం ప్రకటించడంతో సీపీఎస్ ఉద్యోగులందరూ తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించిందో హామీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment