అన్ని పాఠశాలల్లో ‘బెండపూడి’ అభ్యసన విధానం

 *అన్ని పాఠశాలల్లో ‘బెండపూడి’ అభ్యసన విధానం

*ప్రతి ఉపాధ్యాయుడి మొబైల్‌లో గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌

పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశం



 కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ఉన్నత పాఠశాలలో అమలు చేస్తున్న ఆంగ్ల అభ్యసన విధానాన్ని రాష్ట్రంలోని అన్ని బడుల్లో ప్రవేశపెట్టాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఉపాధ్యాయుడు ప్రసాద్‌ పిల్లలకు నేర్పించిన ఆంగ్ల బోధన పద్ధతులను ఎస్‌ఓపీగా రూపొందించాలని సూచించారు. భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్‌, డైలెక్ట్‌ చాలా ప్రధానమైన అంశాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన బెండపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన విద్యార్థులు.. ప్రభుత్వ బడుల్లో ‘నాడు-నేడు’, ఆంగ్ల మాధ్యమం బోధన వంటి కార్యక్రమాల ద్వారా సీఎం జగన్‌ తమకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. తేజస్విని అనే విద్యార్థిని తన చెల్లితో కలిసి కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.929ను సీఎంకు విరాళంగా ఇచ్చారు. సీఎం ఆ చిన్నారి గుర్తుగా రూ.19 తీసుకొని, మిగతావి తిరిగి ఇచ్చేశారు. ఆంగ్లంలో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ‘ఆంగ్ల పదాల ఉచ్ఛరణపై పరిశోధన చేస్తున్న వారిని బెండపూడి అభ్యసన విధానంలో భాగస్వాములను చేయాలి. గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఉండేలా చూడాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అన్ని బడుల్లో పనులు ప్రారంభం కావాలి

నాడు-నేడు రెండో దశ పనులు నెల రోజుల్లో ప్రారంభం కావాలి. రాష్ట్రవ్యాప్తంగా 23,975 పాఠశాలల్లోనూ పనులు చేపట్టాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థంగా ఉండాలి. విద్యా కానుక కిట్‌ నాణ్యతలో రాజీపడొద్దు. జూన్‌లో అమ్మఒడి పథకం ఉంటుంది. వీటికి సిద్ధంగా ఉండాలి. మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో 434 మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం. బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాలను అందుబాటులోకి తీసుకురావాలి. వీటిని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో గాని, హైస్కూల్‌ ప్లస్‌లోగాని ఏర్పాటు చేయాలి. ఇవి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాలి’ అని ఆదేశించారు.

8.21 లక్షల మందికి ల్యాప్‌టాప్‌లు

‘అమ్మఒడి’కి డబ్బులకు బదులుగా ల్యాప్‌టాప్‌ల కోసం 8.21 లక్షల మంది విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చారని అధికారులు తెలిపారు. ‘రూ.8 వేల కోట్లతో సుమారు 23,975 పాఠశాలల్లో నాడు-నేడు రెండో దశ పనులు చేపడుతున్నాం. ఇప్పటి వరకు 33 వేల అదనపు తరగతులు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆంగ్ల భాష అభ్యసనం కోసం గూగుల్‌ సహకారంతో ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ను ఈ నెల 20న ప్రారంభిస్తున్నాం.  జులై 4న విద్యా కానుక ప్రారంభానికి సన్నద్ధం చేస్తున్నాం’ అని వివరించారు. సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ హాజరయ్యారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top