ఆహా ఏమి రుచి...తినరా మైమరచి... గుడివాడ క్లబ్ వెనుక హోటల్ ఎంతైనా శుచి..

ఆహా ఏమి రుచి...తినరా మైమరచి...

గుడివాడ క్లబ్ వెనుక హోటల్ ఎంతైనా శుచి..

ఉడిపి హోటల్... గుడివాడలో చాలా ఉండేవి. కోమల విలాస్...న్యూ కోమల విలాస్...వాళ్ళది ఒక సంప్రదాయ సిద్ధమైన హోటల్ బిజినెస్.. ఆహారాన్ని ఆదరాబాదరాగా తినడానికి అయితే ఇప్పుడు ఎక్కడ బడితే అక్కడ, ఎవరు బడితే వారు, ఏ సందు దొరికితే ఆ సందులో,  హోటల్ పెట్టి వ్యాపారం చేస్తున్నారు. పెరిగిన జనాభా ప్రాతిపదికన ఇంకా ఎన్ని కావాలంటే అన్ని పెట్టినా చాలనట్లే ఉన్నాయి. పైగా లేజీనెస్ అంటే బద్దకం బాగా పెరిగింది . అదే ఇప్పుడు పెద్ద బిజినెస్ అయ్యింది.  

గృహిణులకు ఇంటి వంట అంటే మంట మంటగా ఉండటం.. వాళ్ళు కూడా చిన్నదో పెద్దదో ఉద్యోగం చేయకుంటే ఇల్లు గడవని కుటుంబాలు కూడా ఉన్నాయి. బయట తినటం వల్ల కలిగే నష్టాలు గురించి హెచ్చరించే వారు లేరు. అన్నిటికీ రాజీపడి మంచిని చెడుని కూడా వ్యక్తం చేయడం లేదు . 90 ఏళ్ళు ఆరోగ్యంగా జీవించిన మా ప్రిన్సిపాల్ యెర్నేని వెంకటేశ్వరరావు గారు బయట టిఫిన్ అంటే వీపు పగులుతుంది అనేవారు. మా పిల్లలు, ఆవిడ ఎప్పుడైనా బయట టిఫిన్ కావాలంటే ఆయనకు చెప్పకుండా దొంగచాటుగా తీసుకుని రమ్మని రహస్యంగా చెప్పేవాళ్ళు.. అయినా ఏమిటా గుసగుసలు అని ఆయన కనిపెట్టేసే వారు. వీళ్ళ దొంగ మొహాలు దొరికిపోయేవి. ఆయన చాలా అనునయంగా చెప్పేవారు. బయట తిండి ప్రమాదం. వాళ్ళు వాడే నూనెలు, శుభ్రత, ముడి పదార్థాలు...చచ్చువి పుచ్చువి కూడా వేసి.. అన్నిటికంటే ముఖ్యమైనది వండేవాడి హృదయం." నా పిల్లలు బాగా ఇష్టపడతారు.. వాళ్ళు బాగా తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి..మాంచి ఆలోచనలు..చదువు.. కలిగి ఉత్సాహంగా జీవించాలి..భూతదయ కలిగి ఉండాలి"...అంటే అందరికీ పెట్టే గుణం వాళ్ళల్లో కలిగించేది ఆహారమే... నేను రుచిగా తింటున్న ఈ పదార్థం నా స్నేహితులు కూడా తింటే ఆనందిస్తారు అనిపించటం. మా అమ్మ ఆ ఐటమ్ బాగా చేస్తుంది అని గర్వంగా చెప్పుకో గల అవకాశం పిల్లలకు హోటల్ తిండి వలన రాదు కదా.. కనుక ప్రేమతో ఇంట్లో పచ్చడి వేసుకుని తిన్నా అది ఎంతో మధురంగా ఉంటుంది. డబ్బులు పోసి స్టార్ హోటల్ కెళ్ళి తిన్నా కడుపు ఉబ్బరంగా అయిపోయి ఇబ్బంది కలుగుతుంది. వండే వారి హృదయం అంటే అదే..వండే చేతిలోని గుణం ఎంతైనా ప్రభావం చూపిస్తాయి.

ఉడిపి బ్రాహ్మణులు ఎందుకు వంటకు ప్రసిద్ధులు అంటే.. రాజుల కాలంలో యుద్ధం ఏ క్షణమైనా గంట మ్రోగించవచ్చు. అందరూ యుద్దానికి వెళ్ళి పోతే పరిజనులకు అంతఃపుర వాసులకు.. పిల్లలు, స్త్రీలు, వృద్దులకు, రోగులకు, ఖైదీలకు, సైన్యానికి ఎవరికి తగిన వంటకం వారికి అందించాలి. ఒకే ఆహారం అందరికీ తగదు కదా.. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ యెర్నేని వెంకటేశ్వరరావు గారు చెప్పిన వండే హృదయం ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసి వస్తుంది. సైన్యానికి వండే వంటలో దేశభక్తి, అందుకు అవసరమైన మానసిక శక్తి, ధృఢమైన శారీరక సత్తువ కలిగించి..అలసట, అసౌకర్యం కలగకుండా ఎంత సేపైనా శత్రువుని ఎదుర్కొనే ధైర్యం..వారిని నిర్జించే పౌరుషం..ఆ శక్తియుక్తులు అన్నీ ఆహారం ద్వారానే యుద్ధభూమిలో అందించాలి. గాయపడిన వారికి వేరే ఆహారం. ఎంతటి నేషనల్ ఛాంపియన్ అయిన ఆటగాడైనా.. పహిల్వాన్ అయినా... తిండి తేడా వచ్చి కడుపులో గుడ గుడ లాడితే.. ఇంకేముంది అంతా పైసలా... వెనుదిరిగటమే..

కనుక ఆహారం మన శక్తిసామర్థ్యాలను పెంపొందగలదు. మన శక్తిసామర్థ్యాలను నాశనం చేయగలదు. ఉడిపి బ్రాహ్మణులు ముఖ్యంగా నేనిక్కడ పేర్కొంటున్న గుడివాడ లోని క్లబ్ హోటల్ శ్రీ సాయి తేజ ఉడిపి హోటల్  ప్రత్యేకత ఓపెన్ కిచెన్. కొన్ని హోటళ్ల వంట గదిలోనికి మనకు ఎంట్రన్స్ ఉండదు. చూడలేము కూడా..చూసాక ఇక ఏమీ తినలేము కూడా..అంతంత దారుణంగా ఉంటాయి. ఉడిపి హోటల్ తిండి రుచిగా ఉంటాయి.. శుభ్రంగా ఉంటాయి... దేవుని గుడిలాగా అగరు ధూపం ఓ విధమైన భక్తి వాతావరణంలో ఆహారం సిద్ధంగా ఉంటుంది. నూనెలు వాడకం నుంచి ఆరోగ్యానికి ముడిపడిన అంశాలలో రాజీ పడకుండా జాగ్రత్త వహిస్తారు. సప్లయర్లు కూడా శుభ్రం పాటిస్తారు. నేను వాళ్ళకు తెలియకుండా ఇక్కడ కిచెన్ ఫొటోలు.. హోటల్ ఫొటోలు తీసాను. 

గుడివాడలో ఇప్పుడు గుడివాడ క్లబ్ వెనుక హోటల్ లేదా క్లబ్ హోటల్ అనేది 60 ఏళ్ల క్రితం ఏర్పడింది. ముందుగా వినాయకుని గుడి ఎదురుగా మెయిన్ రోడ్డు లో లోటస్ గిఫ్ట్ కార్నర్, సంగీత మొబైల్స్ షోరూం ఉన్న ఎస్.బీడీ రాజుగారి బిల్డింగ్ లో ఉండేది. ఇప్పటి సాయితేజ ఉడిపి క్లబ్ హోటల్ నడిపే రాఘవేంద్రరావు (రఘు) తాతగారు విష్ణుమూర్తి అక్కడ హోటల్ స్థాపించారు. ఎవరైనా తిని డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని పోతుంటే నవ్వుతూ పొమ్మని దీవించేవారు. ఆ తర్వాత ఇప్పుడు హోటల్ ఉన్న చోట పూరి పాకలో రఘు తండ్రి రాధాకృష్ణ మూర్తి కోర్టు భవనానికి ఎదురుగా హోటల్ ప్రారంభించారు. కోర్టు క్యాంటీన్ అని పిలిచే వారు. ఇప్పుడు గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వెనుక ఉండటంతో క్లబ్ హోటల్ అని పేరు వచ్చింది. తండ్రి బిల్డింగ్ శ్లాబ్ వేయగా రాఘవేంద్రరావు దానిని ఆధునిక హంగులతో కొద్దిగా తీర్చిదిద్దారు. ఇక్కడ అల్పాహారం కోసం అధికమంది అర్రులు చాచి వస్తుంటారు. కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో నిరభ్యంతరంగా మహిళలు కూడా వచ్చి వారికి నచ్చిన పదార్థాలు ఆర్డర్ ఇచ్చి సంతృప్తికరంగా పుచ్చుకుని, ఇంట్లో వారికి పార్శిల్ చేయించుకుని తీసుకుని వెళతారు. ఇక్కడ అల్పాహారం పార్శిల్ కోసం క్యూ కడుతుండటం, అరగంట పాటు అయిన ఓపిగ్గా ఉండి పార్శిల్ అందుకుని ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఆనందంగా ఉదయం సాయంత్రం వేళల్లో స్పెషల్ సాంబార్ తో పండుగలా టిఫిన్ భోంచేయడం చూడవచ్చు. అరిటాకులో దీక్షాపరులు కూడా ఇక్కడ నిరభ్యంతరంగా తింటూఉంటారంటే వీరి శ్రద్ధ గమనించవచ్చు. క్లబ్ హోటల్ టిఫిన్ అంటే సై..సై అనుకూంటూ వచ్చేయడం గుడివాడలో ఒక ఫ్యాషన్ గా మారటం రఘు విజయం. ఈ హోటల్ గారి, ఆవడ, సాంబార్, కట్టుపొంగల్, టమాటా బాత్, చపాతీ స్పెషల్. ఇడ్లీలు, మినప, పెసర దోసెలు, మైసూర్ బజ్జీ , పూరీ వంటివి ఇంకా.. చట్నీ, అల్లపు ఛట్నీ స్పెషల్ . వడ్డించే ప్లేట్లు గ్లాసులు నీళ్ళు అన్నీ మనముందే శుభ్రంగా తీర్చిదిద్దుతారు. క్లీనర్ లు ఆడవాళ్ళు. శుభ్రంగా పనిచేస్తారు. ఇక్కడ ప్రతిదీ మనం చూడాలంటే నేరుగా వెళ్లి చూడవచ్చు. అదే ఉడిపి రఘు నిజాయితీ. కస్టమర్లకు తగిన గౌరవం ఇస్తూ సమాధానం ఇచ్చేందుకు రఘు అక్కడే తిరుగుతూ ఉంటారు కూడా... సర్వింగ్ ఏరియా అంతా పెద్ద పెద్ద దేవుడు బొమ్మలు దర్శనమిస్తాయి. ఈశాన్య వాస్తు పరంగా రెండు రోడ్లు తూర్పు, ఉత్తరంలో ఈ ఉడిపి బ్రాహ్మణుల హోటల్ అందరికీ పార్కింగ్ సౌకర్యం పెట్టకనే ఉంది. ఆరోగ్యవంతమైన జీవితానికి.. ఇంట్లో అల్పాహారం బదులుగా ఎక్కడ తినవచ్చు అంటే ఒక మంచి కుటుంబ ఆప్షన్ క్లబ్ హోటల్.

 ఈరోజు మా వివాహ దినోత్సవం తిధులు ప్రకారం. మా ఆవిడ కందిపోకుండా ప్రిన్సిపాల్ గారు ఇంటికి దగ్గరలో ఉన్న ఈ హోటల్లో ఆయనకు మనసులోనే నమస్కరించుకుని వెళ్ళి టిఫిన్ చేశాం. నా ఐటమ్ సింగిల్ ఇడ్లీ.. బకెట్ సాంబార్...ఆ సాంబార్ వేసుకోవడం ఇక ఆపండి చాలు...ఆ సర్వర్ తిరగలేక చేస్తున్నాడు అని మా ఆవిడ నా సాంబార్ పూనకం ఆపేసింది. డబ్బులు ఇస్తున్నాం కదే..అంటే... డబ్బులే కాదు... పొట్ట కూడా మనదే..ఈ రోజు ఇంట్లో చింతచిగురు పప్పు... జాగ్రత్త..అంది..

మంచి హృదయం కలిగిన చోటే మంచి ఆహారం తినాలి. తాత తండ్రుల నుండి హోటల్  నిర్వహిస్తూ.. శుచిగా శుభ్రంగా కస్టమర్లకు ఆహార పదార్థాలు అందిస్తూ.. బిజినెస్ ను సంస్కారం సంస్కృతి సంప్రదాయాలు పాటించి నిర్వహిస్తున్న చోటు కనుకే.. ఎంతటి మూలనున్నా... వెతుక్కుంటూ క్లబ్ హోటల్ కి అదే ఉడిపి హోటల్ కి వెళ్ళటం  గుడివాడ వాసులకు నిజమయిన ఆనందం. వేడి వేడి సాంబార్ తో రుచికరమైన చట్నీ లతో  ఘుమఘుమల వాసనలు వస్తుంటే ప్లేటు వెనుక ప్లేట్ లాగించటం ఆపలేం. ఆహారాన్ని ఆదరాబాదరాగా కాకుండా ఆనందంగా భుజించడం మన సంస్కృతి.

డాక్టర్ ఎమ్మెస్వీ సత్యనారాయణ బాబు (కపర్ది).

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top