డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే ఆరోగ్య బీమా సేవలను ప్రారంభించింది. ఫోన్ పే అనుబంధ సంస్థ ఫోన్ పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ మంగళవారం నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను లాంఛ్ చేసింది. దేశంలోని ప్రముఖ బీమా సంస్థల భాగస్వామ్యంతో సమగ్ర బీమాను అందించే హెల్త్ ఇన్సూరెన్సు సేవలను ప్రారంభించినట్లు ఫోన్ పే తెలిపింది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో యూపీఐ మంత్లీ మోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, అలాగే కస్టమర్లు తక్కువ ధరలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునే అవకాశం ఉంటుందని ఫోన్ పే ప్రకటనలో తెలిపింది. ఈ ఆరోగ్య బీమాలో రూ. కోటి వరకు కవరేజీ ఉంటుందని చెప్పింది. వినియోగదారులు ఎటువంటి పరిమితి లేకుండా ఏ ఆస్పత్రినైనా ఎంచుకోవచ్చని వెల్లడించింది. వినియోగదారుల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోని సంవత్సరాల్లో బోనస్ కవర్ ను బెస్ కవర్ కంటే ఏడు రెట్ల వరకు అధికంగా పొందవచ్చని, ఇది తాము అందిస్తున్న ప్రత్యేక ఫీచర్ అని ఫోన్ పే పేర్కొంది.
ఫోన్ పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ద్వారా తీసుకునే ఆరోగ్య బీమా ప్లాన్‌లలో వినియోగదారులకు అన్ని విషయాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తామని సంస్థ తెలిపింది. క్లెయిమ్‌లు, ఇతర సేవలను యాక్సెస్ చేయడంలో సహాయపడటానికి ప్రీ, పోస్ట్ సేల్స్ సహాయం అందించనున్నట్లు పేర్కొంది. అంటే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ముందు తీసుకున్న తర్వాత ఫోన్ పే ప్రత్యేకంగా కస్టమర్లకు అవసరమైన సాయం అందిస్తుంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సేవల గురించి ఫోన్‌పే ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ గాలా మాట్లాడుతూ.. ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడంలో అతిపెద్ద అవరోధాలలో ఒకటి అందుబాటు ధర అని, నెలవారీ చెల్లింపులు చేసే వెసులు బాటు కల్పించడం ద్వారా ఆ సమస్యను తాము అధిగమించామని చెప్పారు. వినియోగదారులు చాలా తక్కువ ఆర్థిక భారంతో నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లలో చెల్లించగలిగేలా చేయడం ద్వారా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ మందికి చేరువ అవుతుందని ఆశిస్తున్నట్లు హేమంత్ పేర్కొన్నారు.
ఫోన్ పేలో ఆరోగ్య బీమాను కొనుగోలు చేయడం సులభమని సంస్థ తెలిపింది. కస్టమర్లు చేయవలసిందల్లా వారు ఆరోగ్య బీమా చేయాలనుకుంటున్న సభ్యులందరి ప్రాథమిక వివరాలను నమోదు చేసి కోట్స్ పేజీకి వెళ్లాలి. ఆ తర్వాత మీ బడ్జెట్ అనుగుణంగా ప్లాన్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత, ఆరోగ్య వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత డిటైల్స్ అన్ని చెక్ చేసుకుని మంత్లీ పేమెంట్ లేదా వార్షిక పేమెంట్ లలో ఒక ఆప్షన్ సెలక్ట్ చేసుకుని చెల్లింపులు జరపవచ్చు.
0 comments:
Post a Comment