తెలివి తక్కువ సింహం మరియు తెలివైన కుందేలు Telugu Neethi Kathalu Writing
ఒక అడవిలో క్రూర స్వభావం కల సింహం నివసిస్తోంది. సింహం చాలా బలమైనది కావడంతో కనపడిన జంతువునల్లా వేటాడేది. దీంతో ఏ క్షణాన, ఎటునుండి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని అడవిలోని జంతువులు భయపడుతూ బ్రతుకుతున్నాయి. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సమావేశమైనాయి. “మిత్రులారా! సింహం ఇదేవిధంగా వేటాడి కనపడిన జంతువునల్లా తిన్నట్లయితే మనలో ఎవరూ మిగలరు. కాబట్టి మనలో రోజుకొకరు సింహానికి ఆహారంగా వెళ్లినట్లైతే అనుకోని ప్రాణభయం ఉండదు” అని తీర్మానించుకుని ఈ విషయాన్ని సింహం దృష్టికి తీసుకుని వెళ్ళాయి. వేటాడకుండానే ఆహారం స్వయంగా తనవద్దకు వస్తుందని ఆనందిస్తూ, ఈ ఒప్పందానికి సింహం అంగీకరించింది. “సమయానికి నాకు ఆహారం అందకపోతే మీ అందరిని నేను శిక్షిస్తాను” అని సింహం గర్జించి హెచ్చరించింది. సింహానికి ఇచ్చిన మాట ప్రకారం ఆరోజు నుండి అడవి జంతువులు రోజుకొకరు చొప్పున ఆహారంగా వెళుతున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు చాలా తెలివైంది కావడంతో ఈ అపాయం నుండి ఎలా తప్పించుకోవాలా? అని పథకం వేసింది. చెప్పిన సమయానికి కాకుండా కుందేలు చాలా ఆలస్యంగా సింహం వద్దకు వెళ్ళింది. సింహానికి ఆకలి వేసి అడవి జంతువులపై కోపం వచ్చింది. కుందేలు అడుగులో అడుగు వేసుకుంటూ సింహం వద్దకు చేరింది.
“ఇంత ఆలస్యంగానా వచ్చావా?” అని సింహం గర్జించింది. కుందేలు భయ పడినట్లు నటిస్తూ “లేదు మృగరాజా! నేను నా మిత్రులతో కలసి సకాలంలోనే నీ వద్దకు బయలుదేరాను. దారిలో మరో సింహం నాకు ఎదురైంది. తనే ఈ అడవికి రాజునని, తన మాటకు ఎదురు చెప్పిన వారిని శిక్షిస్తానని బెదిరించింది. మీకు ఈ విషయం చేరవేయాలని దాని నుండి ఎలాగో అలా తప్పించుకుని వచ్చాను మృగరాజా!” కుందేలు భయం నటిస్తూ చెప్పింది. సింహానికి అహం దెబ్బతింది. “ఆ సింహం ఎక్కడ ఉందో చూపించు, దాని అంతు తేల్చిన తరువాత నీ దగ్గరకు వస్తాను. నిన్ను ముందుగానే తింటే దాని జాడ నాకు చూపించేవాళ్ళు ఉండరు కదా?” అన్నది సింహం. కుందేలు ఒక బావి వద్దకు సింహాన్ని తీసుకుని వెళ్ళి “మృగరాజా! ఆ సింహం ఈ నూతిలోనే ఉంది” అని చెప్పింది.
సింహం బావి గట్టుపై నిలబడి లోనికి తొంగి చూసింది. బావిలోని నీళ్ళల్లో దాని నీడ కనిపించింది. సింహం గర్జించింది, దాని ప్రతిబింబం కూడా అదే విధంగా చేయడం చూసి సింహం భ్రమపడింది. ఈత రాని తెలివి తక్కువ సింహం, నీళ్ళల్లోని తన ప్రతిబింబాన్ని చూసి శత్రువని భావించి భీకరంగా గర్జిస్తూ బావిలోకి దూకింది. బావిలో నుండి సింహం బయటకు రాలేకపోయింది. తర్వాత సింహం తన తప్పును తెలుసుకున్నది. కుందేలు చాలా సంతోషించి ఈ విషయాన్ని తన మిత్రులతో చెప్పింది. మృగాలన్నీ కుందేలును చాలా ప్రశంసించాయి. ఆనాటి నుండి ప్రాణభయం లేకుండా జంతువులన్నీ స్వేచ్ఛగా అడవిలో తిరుగుతూ జీవనం సాగించాయి.
MORAL : సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తే అవి సునాయాసంగా పరిష్కారమౌతాయి.
0 comments:
Post a Comment