ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం తెలుసుకోవాల్సిన కీలక విషయాలు!
🌺మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి ప్రయోజనాలు అనేకం
అవగాహన కలిగి ఉండటం శ్రేయస్కరం
ఆలంబనగా నిలిచే జీవోలెన్నో
కుటుంబసభ్యులు తెలుసుకోవడం చాలా అవసరం
గుంటూరు: ఆయన ఓ శాఖలో కీలక ఉద్యోగి. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నింపారు. తేరుకోవడానికి కుటుంబసభ్యులకు రోజులు పట్టింది. అటు తరువాత ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం, రాయితీల గురించి తెలియక కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఏ ధ్రువపత్రాలు పొందుపరచాలో, ఎవరికి దరఖాస్తు చేసుకోవాలో తెలియక తికమకపడ్డారు. ఇది ఈ ఒక్క ఉద్యోగి కుటుంబానిదే కాదు. సర్వీసులో ఉండగా అకాల మరణం పొందిన చాలా కుటుంబాలదీ ఇదే పరిస్థితి. అందుకే సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి బెనిఫిట్స్ గురించి తెలుసుకోవడమే కాకుండా కుటుంబసభ్యులకు తెలియజేయాలి.
🌺ఉద్యోగి అకాల మరణం పొందితే ప్రభుత్వం మానవత్వంతో స్పందిస్తుంది. అవకాశమున్నంత వరకూ నిబంధనల మేరకు సదరు ఉద్యోగి కుటుంబానికి పరిహారం, రాయితీలు, ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. దీనికిగాను కొన్ని మార్గదర్శకాలు పాటిస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా కాలం, పరిస్థితుల ప్రాతిపదికన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు మారుస్తూ అమలుచేస్తున్నాయి. వీటిపై ఉద్యోగులతో పాటు వారి కుటుంబసభ్యులకు అవగాహన అవసరం.. ఆవశ్యం. అవి ఏమిటో తెలుసుకుందాం.
🌺అంత్యక్రియలకు సాయం
ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల ఖర్చుకుగాను తక్షణం రూ.15 వేలు అందిస్తారు. 2010 ఏప్రిల్ 24న ఇందుకుగాను ఒక ప్రత్యేక జీవో 192 జారీచేశారు. ఈ జీవోలో అన్ని వివరాలు పొందుపరిచారు. మరణించిన ఉద్యోగి మృతదేహాన్ని తరలించడానికి సంబంధించి రవాణా చార్జీలు సైతం ప్రభుత్వ చెల్లిస్తుంది. ఎక్కడైతే మరణిస్తారో అక్కడి నుంచి తరలించే ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీలు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1987 జూన్ 23న జీవో 153 జారీచేశారు.
🌺ఎన్‌క్యాష్‌మెంట్
మృతిచెందిన ఉద్యోగి ఎర్న్‌డ్ లీవ్‌లకు సంబంధించిన ఎన్‌క్యాష్‌మెంట్‌ను కుటుంబసభ్యులకు చెల్లిస్తారు. ఈ ఎన్‌క్యాష్‌మెంట్‌ను 240 రోజుల నుంచి 300 రోజులకు పెంపుదల చేశారు. దీనికి సంబంధించి 2005 సెప్టెంబర్ 16న జీవో 232 జారీచేశారు.
🌺యాక్సిడెంటల్ ఎక్స్‌గ్రేషియా
విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు ప్రమాదాల్లో మృత్యువాత పడితే ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాను చెల్లిస్తుంది. దీనికి సంబంధించి 2006 జూలై 7న 317 జీవో జారీచేశారు.
రవాణా చార్జీలు
ఉద్యోగి విధి నిర్వహణలో కానీ.. ఇతర ప్రదేశంలో కానీ చనిపోతే ఆ ఉద్యోగి మృతదేహాన్ని ఇంటికి తరలించటానికి చార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సంఘటనా స్థలం నుంచి ఇంటికి తీసుకువెళ్లడానికి నిర్ధేశించిన మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈఅంశంలో మరిన్ని వివరాలు కావాలంటే 1985 సెప్టెంబర్ 15న జారీ చేసిన జీవో 1669 చూడవచ్చు.
🌺సస్పెన్షన్‌లో ఉంటే..
ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్‌లో ఉండగా మరణిస్తే.. సస్పెన్షన్ విధించిన నాటి నుంచి చనిపోయిన కాలం వరకూ మానవతాభావంతో ఆ ఉద్యోగి డ్యూటీలో ఉన్నట్టుగానే పరిగణిస్తారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారంతో పాటు ఇతరత్రా రాయితీలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. ఈ కాలంలో అలవెన్స్‌లు వంటివి వర్తించినా వాటిని కూడా కుటుంబసభ్యులకు చెల్లిస్తారు.
🌺కారుణ్య నియామకం - కరువుభత్యం
ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమిస్తారు. అయితే వారి అర్హతల ప్రాతిపదికన వివిధ స్థాయిల్లో తీసుకునే అవకాశం ఉంది. మరణించిన ఉద్యోగికి సంబంధించి డీయర్‌నెస్ అలవెన్స్ (డీఏ) ను కుటుంబ పెన్సన్ కింద చెల్లించరు. కానీ కారుణ్య నియామకం పొందిన వారికి ఈ మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తారు. దీని వివరాలను 1998 మే 25న జారీ చేసి జీవో 89లో తెలుసుకోవచ్చు.
🌺సంఘ విద్రోహ శక్తుల చేతిలో మరణిస్తే...
విధుల్లో ఉండగా అనుకోని సంఘటనల వల్ల మరణించినా. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లో దుర్మరణం పాలైతే తక్షణం ఆ ఉద్యోగి కుటంబసభ్యులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు.
🌺ఫ్యామిలీ పింఛన్
ఉద్యోగి మృతి చెందితే కుటుంబసభ్యులకు కుటుంబ పింఛన్‌ను వర్తింపజేస్తారు. ఈ పింఛన్ ఉద్యోగిస్థాయి, తరగతిని బట్టి ఉంటుంది. డీసీఆర్‌జీ పింఛన్‌రూల్స్‌కు అనుగుణంగా కుటుంబ పింఛన్ వర్తిస్తుంది.
🌺రుణాల చెల్లింపులు, అడ్వాన్సులు రద్దు
ఒక ఉద్యోగి సంస్థ నుంచి అప్పులు కానీ, అడ్వాన్సులు కానీ తీసుకుని మృతిచెంది ఉంటే ఆమొత్తాన్ని రద్దు చేస్తారు. ఉద్యోగి మరణించిన సమయానికి జీపీఎఫ్‌తో సమానమైన రూ.10 వేలను కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు.
🌺రిఫండ్
ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు ఫ్యామిలీ బెనిఫిట్ కింద మినహాయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగి మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. 1974 నవంబర్ 9న జారీ చేసిన జీవో 307తో పాటు 1983 ఏప్రిల్ 27నజారీ చేసిన జీవో 55 ద్వారా వివరాలను తెలుసుకోవచ్చు.
🌺గ్రూప్ ఇన్సూరెన్స్
ఉద్యోగి తన విధి నిర్వహణలో చక్కగా పనిచేసి, అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే అతని గ్రూపు ఇన్స్‌రెన్స్‌ను రెట్టింపు మొత్తంలో కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. దీనికి సంబంధించి 1969 సెప్టెంబరు 28న 314 జీవో జారీచేశారు
0 comments:
Post a Comment